హంద్రీ–నీవాకు సమాధి కట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవాకు సమాధి కట్టొద్దు

Mar 19 2025 1:51 AM | Updated on Mar 19 2025 1:49 AM

అనంతపురం సెంట్రల్‌: హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సమాధి కట్టే పనులను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలంటూ జలసాధన సమితి నాయకులు మండిపడ్డారు. మంగళవారం స్థానిక కోర్టు రోడ్డులోని పప్పూరు రామాచార్యుల విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్‌ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో 6 లక్షల ఎకరాలు, ఉమ్మడి జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉన్నా నెరవేరడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 6,300 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేయాలని నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారన్నారు. అయితే ఆ జీఓను రద్దు చేస్తూ జీడిపల్లి నుంచి కుప్పం వరకూ నీటిని తీసుకుపోవడానికి చంద్రబాబు ప్రభుత్వం లైనింగ్‌ పనులకు తెరతీసిందన్నారు. పనులను రద్దు చేయాలని ప్రజా, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు మూలకు పడేశారని విమర్శించారు. 40 టీఎంసీల ‘హంద్రీ–నీవా’ను కుదించి కేవలం రూ. 25 కోట్ల లోపే నిధులు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అయినా, ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకుంటుండటం సిగ్గుచేటన్నారు. 15 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులకు ఎంత మేర నిధులు ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లైనింగ్‌ పనులను వెంటనే రద్దు చేయాలని, హంద్రీ–నీవా ప్రయోజనాలకు సమాధి కట్టే 404, 405 జీఓలను వెనక్కు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి వరకూ కాలువను 6 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయాలన్నారు. ఓపీడీఆర్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అడ్వొకేట్‌ అబ్దుల్‌ రజాక్‌, కార్యదర్శి ఉపేంద్రకుమార్‌, అడ్వొకేట్‌ ప్రకాష్‌, రైతు కూలీ, ఐఎఫ్‌టీయూ, పట్టణ పేదల సంఘం నాయకులు నాగరాజు, కృష్ణ, యేసురత్నం, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుపై జలసాధన సమితి నాయకుల మండిపాటు

లైనింగ్‌ పనులు వద్దే వద్దు

ఆత్మకూరు: మండలంలోని పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌ పనులను మంగళ వారం రైతులు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా తరలివచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాలువ లైనింగ్‌ జరిగితే బోర్లలో నీరు తగ్గి పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంకు నీరు తీసుకెళ్లాలన్న యోచనతో స్థానిక రైతులకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదన్నారు.

హంద్రీ–నీవాకు సమాధి కట్టొద్దు 1
1/1

హంద్రీ–నీవాకు సమాధి కట్టొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement