
ప్రభుత్వ కార్యాలయం అంటేనే ప్రజల ఆస్తి. ఇక్కడ ప్రజల అవసర
● కార్యాలయ ఆవరణలో ఇటీవల ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం
● సెక్యూరిటీ కొరత వల్ల పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు
● భద్రత పెంచాలని కోరుతున్న వాహనదారులు
అనంతపురం సెంట్రల్: జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలన్నింటిలోకి రోడ్డు రవాణా శాఖకు చెందిన ఉపరవాణా కమిషనరు(డీటీసీ) కార్యాలయం అతి పెద్దది. మొత్తం ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్, వాహనాల ఫిట్‌నెస్ ట్రాక్‌లతో పాటు సువిశాలమైన కార్యాలయాన్ని నిర్మించారు. అలాగే వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి ఇక్కడే డంప్ చేస్తుంటారు. దీంతో రోజులో 24 గంటలూ కార్యాలయానికి భద్రత అత్యంత అవసరమైంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటన కార్యాలయ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఓ యువకుడిని ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించిన ఇద్దరు యువతులు (స్నేహితులు) తాము మోసపోయామని గ్రహించి కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పక్కన పెడితే సెలవు రోజున, అది కూడా ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
వేధిస్తున్న సెక్యూరిటీ కొరత
రవాణా శాఖ కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రత, నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గతంలో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది పనిచేసేవారు. ఇటీవల సక్రమంగా వేతనాలు అందకపోవడం, అది కూడా అరకొర వేతనం కావడంతో జీవనం దుర్భరమై ఇద్దరు వదిలేశారు. ఉన్న ఇద్దరు రోజుకొకరు చొప్పున ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు 24 గంటలు చొప్పున విధులు నిర్వర్తించడం భారంగా మారింది. దీంతో శారీరక, మాససిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి సెలవు రోజు ఇద్దరు యువతులు కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించి విషపూరిత ద్రావకం తాగారు. అంతేకాక కార్యాలయ ఆవరణలో పరుచుకున్న పచ్చదనం కింద సేద తీరేందుకు పలువురు అనధికారికంగా చొరబడుతున్నారు. వీరిలో కొందరు అక్కడే మద్యం తాగి పడిపోతుంటారు.
రూ. కోట్లు విలువజేసే వాహనాలు
వివిధ కేసులు, నేరాల్లో పట్టుబడిన రూ.కోట్లు విలువ చేసే వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేయడం సర్వసాధారణం. ఇటీవల దాదాపు వంద వాహనాల వరకూ వేలం వేశారు. ఇంకా వందల్లో వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు పోలీసులకు డ్రంక్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వాహనాలు ఎప్పటికప్పుడు ఆర్టీఏ కార్యాలయ ఆవరణకు చేరుతుంటాయి. వీటికి సంబంధించి అధికారులు విధించిన జరిమానాను చెల్లించి వాహనదారులు విడిపించుకుని వెళుతుంటారు. అప్పటి వరకూ ఆ వాహనాలలో ఏ చిన్న బోల్టు పోయినా కార్యాలయ అధికారులదే బాధ్యత అవుతుంది. ఇంతటి కీలకమైన అంశాన్ని ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యంగా పక్కన పెట్టేశారు. దీంతో తమ వాహనాల భద్రతపై యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండిన పిచ్చి మొక్కలు, గడ్డికి నిప్పు రాజుకుని అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంటే అప్రమత్తం చేసే సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడ గతి లేకుండా పోయింది. దీంతో కార్యాలయ ఆవరణలో నిలిపిన వందలాది వాహనాలతో పాటు ఆఫీసులోని రికార్డుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.