అనంతపురం అర్బన్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్ విడుదల చేసి, మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.