అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చామన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
ఫైళ్ల దగ్ధంపై
ఉన్నతాధికారుల విచారణ
● క్లూస్ టీంతో పోలీసుల దర్యాప్తు
ఉరవకొండ: స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సోమవారం ఏడీఏ కార్యాలయంలో క్లూస్ టీంతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఘటనపై వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ విలేకర్లతో మాట్లాడారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో ప్రమాదం సంభవించిందని ఏఈఓ భరత్ ద్వారా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశామన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో కార్యాలయానికి చేరుకుని ఫైళ్లు పరిశీలించినట్లు తెలిపారు. డిసెంబర్ 2021 వరకు డిపార్ట్‌మెంట్ ఆడిట్ జరిగిందని, ఆ ఫైల్స్ మొత్తం భద్రంగా ఉన్నాయన్నారు. 2013 తరువాత ఫైళ్లు కొన్ని కాలిపోయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం కాలిపోయిన వాటిలో ఎక్కువ శాతం రైతులకు అవగాహన కల్పించే కరపత్రాలు, బుక్‌లెట్‌లు ఉన్నాయన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
నిలకడగా చింత పండు ధరలు
హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు.ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగాయి.
పదో తరగతి
విద్యార్థులకు గాయాలు
బొమ్మనహాళ్: పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు బొమ్మనహాళ్, ఉద్దేహాళ్‌లోని పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీంతో సోమవారం ప్రారంభమైన తొలి పరీక్షకు విద్యార్థులు రంజిత్, సురేష్‌తో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గోవిందవాడ గ్రామం వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పడంతో కిందపడ్డారు. ఘటనలో రంజిత్, సురేష్‌కు బలమైన గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరీక్షల వేళ సకాలంలో బస్సులను నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని, ఫలితంగా పిల్లలు ద్విచక్రవాహనంపై పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం
సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం