ఉరవకొండ: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన సొంత డబ్బా కొట్టుకునేందుకే కాకినాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు గురించి ఇందులో ఒక్కమాట కూడా ప్రస్తావించకుండా తన నైజాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవిర్భావ సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపరిచారన్నారు. హిందీ– తమిళ్ వివాదం తెరపైకి తెచ్చి మరో వివాదానికి తెరలేపారన్నారు. ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలను తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీశారని, ఇదే తరహాలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ సైతం కేంద్రాన్ని నిలదీయకపోగా భాషలు, డిలిమిటేషన్‌పై మోదీ సర్కార్‌కు వత్తాసు పలకడం ఆశ్చరాన్ని కలిగిస్తోందన్నారు. జిల్లాకు వరదాయినిగా ఉన్న హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేస్తే అది హంద్రీ–నీవా ఆయకట్టు దారులకు మరణశాసనమే అవుతుందన్నారు. హంద్రీ–నీవా కాలువను భవిష్యత్తులో వెడల్పు చేయకుండా ఉండేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. జిల్లాలోని 3.50లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నీటితో నింపి భూగర్భ జలాలు పెంపొదించడమే హంద్రీ–నీవా ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. లైనింగ్ పనులు చేపడితే తాగు, సాగునీరుతో పాటు చెరువులకు కూడా నీరు అందకుండా పోతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే హంద్రీనీవా మొదటి దశ 95శాతం, రెండోదశ 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం రెండో విడతలో హంద్రీనీవా పనులు ఒక్క కిలోమీటరు చేయకుండా కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికి లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే హంద్రీ–నీవా పనులను చంద్రబాబు తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీవీరన్న, నాయకులు ఈడిగ ప్రసాద్, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న
అన్యాయంపై కేంద్రాన్ని చంద్రబాబు, పవన్ నిలదీయాలి
లైనింగ్ పనులతో హంద్రీనీవాకు
మరణశాసనమే
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి