అనంతపురం అర్బన్: పాలనలో పారదర్శకత పాటించినప్పుడే విమర్శలకు, ఆరోపణలకు అవకాశం ఉండదని జిల్లా ఇన్‌చార్జ్ అధికారి, రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి వివిధ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మండలస్థాయిలో అధికారుల బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింతగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని పారిశ్రామికవేత్తలకు అందించాలని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఏపీఐఐసీ కింద పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అన్ని పంచాయతీల్లో పూర్తి చేయాలన్నారు. డ్వామా కింద కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.