అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 2024–25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంటెక్ నాలుగో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ, ఎం ఫార్మసీ నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఒకటో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–25), రెగ్యులర్ ఒకటో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, ఫార్మా డి నాలుగు, మూడో, రెండో సంవత్సరం (ఆర్–17) అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
అరటికి గిట్టుబాటు ధర కల్పించండి
అనంతపురం అగ్రికల్చర్: అరటికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పండ్లతోటల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం సంఘం నాయకులు కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, శ్రీనివాసులు తదితరులతో కలిసి ఉద్యాన శాఖ కార్యాలయంలో డీడీ బీఎంవీ నరసింహారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా నార్పల, పుట్లూరు, యల్లనూరు, బెళుగుప్ప, యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో 13 వేల మంది వరకు రైతులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నారన్నారు. గ్రాండ్–9 రకం అరటి ఏటా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందన్నారు. అరబ్ దేశాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోందన్నారు. అయితే నెల కిందట వరకు టన్ను రూ.26 వేల వరకు పలికిన అరటి ధర ఇపుడు రూ.13 వేలు, రూ.14 వేలకు ధర పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీలకు సరఫరా చేసే దళారులు కుమ్మకై ్క రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నట్లు తెలిపారు. టన్ను రూ.26 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రామలింగచౌదరికి అవార్డు
అనంతపురం: ఎస్కేయూలోని గ్రామీణాభివృద్ధి శాఖలో అకడమిక్ కన్సెల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.రామలింగచౌదరికి భారత మానవాభివృద్ధి శాఖ అవార్డు ప్రదానం చేసింది. భారత సామాజిక మండలి శాస్త్ర పరిశోధన సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఎస్కేయూ గ్రామీణాభివృద్ధి విభాగంలో మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి.శ్రీధర్ పర్యవేక్షణలో ‘కరువు ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధి భద్రతను మెరుగుపరచడం’పై పరిశోధనలు చేశారు. అంతేకాకుండా పలు అంతర్జాతీయ సదస్సుల్లో గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ నీటి పారుదల సౌకర్యాల ప్రాధాన్యతలను గురించి అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రామలింగచౌదరిని పలువురు అభినందించారు.
ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు విడుదల