ఉద్యాన రైతులకు మరింత లబ్ధి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన రైతులకు మరింత లబ్ధి

Mar 13 2025 11:53 AM | Updated on Mar 13 2025 11:50 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం బాగా పెరిగినందున మెరుగైన ఫలసాయం, మార్కెటింగ్‌ సదుపాయం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ అనుబంధ రంగాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ప్రధానంగా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు అంశాలపై ఆరా తీశారు. అరటి, మామిడి, చీనీ, టమాట, మిరప పంటలను ఐదు గ్రోత్‌ ఇంజిన్లుగా గుర్తించి వాటి ద్వారా రైతులు ఆర్థికంగా లాభపడేలా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలోని ఉత్తరాది ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు పెంచాలన్నారు. నెలాఖరులోపు లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం మామిడి కీలక దశలో ఉన్నందున నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే 50 శాతం రాయితీతో ఇస్తున్న ఫ్రూట్‌ కవర్లు రైతులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానశాఖ స్ఫూర్తితో పట్టుపరిశ్రమశాఖ అధికారులు కూడా జిల్లాలో మల్బరీ విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది 800 ఎకరాల లక్ష్యానికి గానూ 300 ఎకరాలు మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెటింగ్‌ పరిస్థితి బాగున్నందున ఏడాదిలో 10 పంటలు పండించే పరిస్థితి ఉన్నందున రైతులు ఆర్థిక పురోగతి సాధించడానికి మల్బరీని ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన కందులు, పప్పుశనగను మార్క్‌ఫెడ్‌ ద్వారా చేపట్టిన కొనుగోళ్లపై ఆరాతీశారు. కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) దక్కేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, పశుశాఖ జేడీ డాక్టర్‌ జీపీ వెంకటస్వామి, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు, పట్టుశాఖ అధికారి డి.ఆంజనేయులు, మార్కెటింగ్‌శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పెన్నేశ్వరి, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసనాయక్‌, ఆత్మ పీడీ మద్దిలేటితో పాట ఏపీడీలు, ఏడీఏలు, ఏఓలు, హెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement