●వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ●ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2011 మార్చి 12న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ నాటి నుంచి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిందన్నారు. 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమమే ఊపిరిగా మనుగడ సాగించిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ... దేశ ప్రధాన మంత్రులు సైతం ఇచ్చిన మాటను అమలు చేయని సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని, అలాంటిది సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఊహకందని విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఆదేశిస్తే దానిని కూడా చిత్తశుద్ధితో గత 9 నెలలుగా అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమి ప్రభుత్వంపై పోరాటాలు సాగిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి కార్యకర్త పార్టీని అంటి పెట్టుకుని ఉండడం అభినందించదగ్గ విషయమన్నారు.
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున యువతపోరు కార్యక్రమాన్ని నిర్వహించడం అధినేత వైఎస్ జగన్ రెడ్డి పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా, ప్రశ్నించిన వారిని భయపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. అన్ని వర్గాలభ్యున్నతి ఒక్క వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందని, మరోమారు సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చేసుకోవడంలో భాగంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్ల డబ్బును ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరేలా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తదితర వెనుకపడిన కులాలు అన్ని విధాల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే వైఎస్సార్‌సీపీ పనిచేస్తోందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ నాయకులు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, రమేష్‌గౌడ్, సాకే చంద్రశేఖర్, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, చామలూరు రాజగోపాల్, చంద్రశేఖర్ యాదవ్, వెన్నం శివరామిరెడ్డి, చింతా సోమశేఖర్ రెడ్డి, కాగజ్‌ఘర్ రిజ్వాన్, అనిల్‌కుమార్ గౌడ్, సతీష్, రాధాకృష్ణ, చింతకుంట మధు, కేశవరెడ్డి, అశ్వత్థనాయక్, సైఫుల్లాబేగ్, మల్లెమీద నరసింహులు, లబ్బే రాఘవ, అమర్‌నాథ్‌రెడ్డి, కొర్రపాడు హుస్సేన్ పీరా, శ్రీనివాస్‌దత్తా, కై లాష్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, శివశంకర్ నాయక్, కృష్ణవేణి, శ్రీదేవి, దేవి, భారతి, శోభాబాయి, శోభారాణి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాహితమే పార్టీ ధ్యేయం