ఒక్కో సంఘానికి ఒక్కో మేట్‌ | - | Sakshi
Sakshi News home page

ఒక్కో సంఘానికి ఒక్కో మేట్‌

Mar 7 2025 10:10 AM | Updated on Mar 7 2025 10:05 AM

శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి ఎత్తుగడ

ఉపాధి మేట్లగా 90 శాతం అనుయాయులే

వారి చేతిల్లోనే హాజరు, కూలీల డిమాండ్‌

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (పైల్‌)

రాయదుర్గం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఊపందుకున్నాయి. మస్టర్లలో దొంగపేర్లు రాసి సొమ్మంతా సొంత ఖాతాల్లో వేసుకునేలా టీడీపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి పక్కాగా స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి 25 నుంచి 50 మంది కూలీలకు ఓ శ్రమశక్తి సంఘం ఏర్పాటు చొప్పున ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తికావొచ్చింది. మొత్తం ఏడు నియోజకవర్గాలోని 31 మండలాల్లో యాక్టివ్‌ జాబ్‌కార్డుల సంఖ్య 2.60 లక్షలు కాగా, వీటి పరిధిలో 4.58 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 13,164 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటయ్యాయి.

అనుయాయులకే పెద్దపీట

నిబంధనల మేరకు ప్రతి శ్రమశక్తి సంఘానికి ఓ మేట్‌ను నియమించారు. అయితే స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉపాధి కూలీల్లో సీనియార్టీకి తిలోదకాలు ఇచ్చి టీడీపీ నేతలు సూచించిన వారి అనుయాయులకే పెద్దపీట వేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు గుర్తించిన వారే క్షేత్ర సహాయకులు, మేట్లగా చలామణి అవుతున్నారు. ఈ విధానంపై ఉపాధి కూలీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరోక్షంగా టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే మేట్ల వ్యవస్థను కూటమి సర్కార్‌ అమల్లోకి తెచ్చిందని మండిపడుతున్నారు. మండుటెండలో శ్రమించే తమపై వీరి పెత్తనం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని బాహటంగా ప్రశ్నిస్తే వేతనాల్లో కోత వేస్తారమే భయం కూడా కూలీలను వెంటాడుతోంది.

మేట్ల ముసుగులోనే అసలు దోపిడీ

మేట్లుగా ఎంపికై న వారు కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లడం, వారి అవసరాల మేరకు ఆన్‌లైన్‌లో డిమాండ్‌ పెంచుకోవడం, హాజరు నమోదు, వేతనాలకు సిఫారసు చేయడం లాంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియనే టీడీపీ నేతల అక్రమాలకు ఊతమైంది. మస్టర్లలో దొంగ పేర్లు చేర్చి ఉపాధి కూలీల సొమ్ము కాజేసేలా పక్కా ప్రణాళికను రచించి, ఆ మేరకు అడుగులు వేశారు. మేట్‌గా ఉన్న వారికి వారి పరిధిలోని ఒక్కొ కూలీపై రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న 4.58 లక్షల మంది కూలీలకు గాను రోజుకు రూ.6.87 లక్షలు మేట్ల ఖాతాలకు చేరుతోంది. 100 రోజులకు రూ.6.87 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూలీల శ్రమదోపిడీకి కూటమి సర్కార్‌ తెరలేపింది.

గతమంతా స్వర్ణయుగం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఉపాధి కూలీల సంక్షేమానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పనులు కల్పించారు. ఎన్‌ఐసీ సర్వర్‌ ద్వారా ప్రతి పనినీ పర్యవేక్షిస్తూ పైసా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టారు. శ్రమశక్తి సంఘాలతో కూలీల శ్రమదోపిడీని గుర్తించి వాటిని రద్దుచేశారు. ప్రతి పైసాను కష్టపడిన కూలీల ఖాతాకు చేర్చారు. ఫలితంగా అప్పటికే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని ఉపాధి పనులతో ఎంతో సంతోషంగా జీవించారు.

జిల్లాలో శ్రమశక్తి సంఘాల ఎంపిక దాదాపు పూర్తయింది. ఒక్కో సంఘానికి ఒక్కో మేట్‌ను నియమించాం. ఆ గ్రూపు పర్యవేక్షణ, హాజరు చూసే బాధ్యత మేట్‌పై ఉంటుంది. క్షేత్రసహాయకుడు, టెక్నికల్‌, ఏపీఓ, ఎంపీడీఓ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైన మేట్లు అవకతవకలకు పాల్పడితే సత్వరం తొలగిస్తాం.

– సలీమ్‌ బాషా, పీడీ, డ్వామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement