అన్న, కొడుకును చంపేందుకు కుట్ర! | - | Sakshi
Sakshi News home page

అన్న, కొడుకును చంపేందుకు కుట్ర!

Mar 7 2025 10:09 AM | Updated on Mar 7 2025 10:05 AM

రాయదుర్గం: ఆస్తిపై కన్నేసిన ఓ సోదరుడు తన సొంత అన్న, అతడి కుమారుడిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం రాయదుర్గం అర్బన్‌ పీఎస్‌లో సీఐ జయనాయక్‌ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాంపురం సమీపంలోని కేకే పుర గ్రామానికి చెందిన మురారి దామోదర్‌ గౌడ్‌, మధుసూదన్‌ గౌడ్‌లు అన్నదమ్ములు. వీరికి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి సోదరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం క్రితం కూడా గ్రామంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దామోదర్‌ గౌడ్‌ను మధుసూదన్‌ గౌడ్‌ కుమారుడు భార్గవ్‌ చెప్పుతో కొట్టాడు. దీంతో కసితో రగిలిపోయిన దామోదర్‌ గౌడ్‌.. తన అన్న, అతడి కుమారుడిని అంతమొందించాలని భావించాడు. ఇందుకు రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన మారుతిరెడ్డికి రూ.23 లక్షలకు సుపారీ ఇచ్చాడు. గురువారం పల్లేపల్లి గేటు సమీపాన రూ.3 లక్షల అడ్వాన్స్‌, ఇద్దరినీ హత్య చేసేందుకు మూడు వేట కొడవళ్లు అందజేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు.. దామోదర్‌ గౌడ్‌తో పాటు మారుతి రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో ప్రణాళికబద్ధంగా ఆపరేషన్‌ నిర్వహించినట్లు సీఐ జయనాయక్‌ తెలిపారు. రూ.3 లక్షల నగదు, మూడు వేట కొడవళ్లు, రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇటీవల మెచ్చిరి గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో మారుతిరెడ్డి నిందితుడిగా ఉన్నాడని, దీంతో దామోదర్‌ గౌడ్‌ అతణ్ని ఆశ్రయించాడని వెల్లడైందన్నారు. కాగా, హత్యల కుట్రను భగ్నం చేసిన సీఐ, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ జగదీష్‌, డీఎస్పీ రవిబాబు అభినందించి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆస్తి కోసం సోదరుడి పన్నాగం

రూ. 23 లక్షలకు సుపారీ

భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement