బొమ్మనహాళ్: కర్ణాటకలో చోటు చేసుకున్న ప్రమాదంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన మేరకు.. నేమకల్లు గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రత్నమ్మ దంపతుల కుమారుడు జి.నాగరాజు (19), వన్నూరు, వనజాక్షి దంపతుల కుమారుడు కె.గణేష్ (14) ఇద్దరూ మంచి స్నేహితు లు. తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా ఉండేవారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన కొందరితో కలసి నాగరాజు, గణేస్ పాదయాత్రగా కర్ణాటకలోని గూళ్యం గ్రామంలో గాదిలింగేశ్వర జాతరకు బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో కప్పగల్–సిరివర క్రాస్ వద్ద రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, గణేష్‌ను గ్రామస్తులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు అంబులెన్సులో తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం స్నేహితుల మృతదేహాలను మంగళవారం నేమకల్లుకు కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులను సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు.