ఏం కష్టం వచ్చింది ‘తల్లీ’.. | - | Sakshi
Sakshi News home page

ఏం కష్టం వచ్చింది ‘తల్లీ’..

Dec 13 2024 1:57 AM | Updated on Dec 13 2024 1:46 PM

-

ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

తల్లి, కుమారుడు మృతి

ఆస్పత్రిలో చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న కుమార్తె

నాలుగు పదుల జీవితం..రెండు దశాబ్దాల దాంపత్యం. ముత్యాల్లాంటి పిల్లలు. కానీ ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలీదు గానీ పాలబువ్వ పెట్టిన చేతులతోనే ఇద్దరు బిడ్డలకు విషం పెట్టింది. వద్దు.. వద్దంటున్నా విషపుగుళికల నీరు తాగించింది. ఆపై తానూ తాగింది. ఘటనలో తల్లీకుమారుడు మృతి చెందగా..కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

గార్లదిన్నె: కుటుంబ కలహాలతో ఓ మహిళ తనువు చాలించాలనుకుంది. తను వెళ్లిపోతే బిడ్డల పరిస్థితి ఏమిటని తీవ్రంగా ఆలోచించింది. చివరకు కుమార్తె, కుమారుడినీ తనవెంటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. పిల్లలకు బలవంతంగా విషపు గుళికల నీరు తాగించి, తనూ తాగింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. కుమార్తె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు తోంది. ఈ ఘటన గురువారం గార్లదిన్నెలో చోటు చేసుకుంది.

 పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలంలోని యర్రగుంట్లకు చెందిన సురేష్‌కు శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటయ్య దంపతుల కుమార్తె సుజాత (38)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి కుమార్తె రాహిత్య, కుమారుడు నాగ చైతన్య (11)సంతానం. రాహిత్య ప్రస్తుతం చైన్నె సత్యభామ కాలేజీలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం, నాగ చైతన్య గార్లదిన్నెలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. సురేష్‌, సుజాత దంపతులు మూడేళ్ల నుంచి గార్లదిన్నెలో అద్దె భవనంలో నివాసం ఉంటూ కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు తలెత్తగా సుజాత జీవితంపై విరక్తి చెందింది.

తనతో పాటు పిల్లలనూ తీసుకువెళ్లాలని..
గురువారం ఉదయం భర్త సురేష్‌ గార్లదిన్నె నుంచి యర్రగుంట్లలోని వ్యవసాయ తోట వద్దకు వెళ్లగా... సుజాత గార్లదిన్నెలోని ఓ ఫర్టిలైజర్‌ షాపులో విషపుగుళికలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లింది. అనంతరం తలుపులు వేసుకొని మొదట కుమార్తె రాహిత్య, కుమారుడు నాగ చైతన్యకు విషపు గుళికలు నీళ్లలో కలిపి తాపించే ప్రయత్నం చేసింది. పిల్లలు వద్దన్నా వినకుండా బలవంతంగా విషపుగుళికలు కలిపిన నీళ్లు తాగించింది. 

అనంతరం ఆమెకూడా తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో కుమార్తె రాహిత్య బయటకు వచ్చి జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలిపింది. వెంటనే వారు సుజాత, రాహిత్య, చైతన్యలను కారులో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. కుమారుడు చైతన్య, కుమార్తె రాహిత్యకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరుకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే సుజాత కుమారుడు నాగ చైతన్య మృతి చెందాడు. ప్రస్తుతం రాహిత్య బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సుజాత, నాగచైతన్య మృతదేహాలను అనంతపురంలోని సర్వజనాస్పత్రి మార్చురీలో ఉంచారు.

మిన్నంటిన రోదనలు
సమాచారం తెలుసుకున్న సుజాత కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న సుజాత, చైతన్యలను చూసి బోరున విలపించారు. ఏ కష్టంవచ్చిందని ఇంతపని చేశావు తల్లీ అంటూ వారు రోదించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.

భర్తపై కేసు నమోదు
సుజాతను భర్త సురేష్‌ నిత్యం వేధిస్తుండేవాడని, చిన్న, చిన్న విషయాలకే ఘర్షణ పడి నెల రోజులైనా భార్యతో మాట్లాడేవాడు కాదని బంధువులు తెలిపారు. సురేష్‌ పెట్టిన మానసిక వేధింపులతోనే సుజాత పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుజాత, ఆమె కుమారుడు చైతన్య మృతికి భర్త సురేష్‌ కారణమని తెలిపారు. దీంతో సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement