అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024 ఈనెల 3 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈనెల 21 వరకు టెట్ జరగనుంది. రోజూ రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అనంతపురం నగరంలో ఆరు కేంద్రాలు, తాడిపత్రిలో రెండు, గుత్తిలో ఒకటి, బెంగళూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పేపర్లు కలిపి మొత్తం 44,855 మంది అభ్యర్థులు రాయనున్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వైద్యసేవల కోసం ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారన్నారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోరని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్, గుర్తింపుకార్డుతో గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రాల వివరాలు https://doeananthapuramu. blogspot.com వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు cse.ap.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని డీఈఓ సూచించారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
జిల్లాలో పరీక్ష రాయనున్న
44,855 మంది అభ్యర్థులు
అనంతపురంలో 6, తాడిపత్రిలో 2, గుత్తిలో ఒకటి, బెంగళూరులో మూడు కేంద్రాలు