విడపనకల్లు: మండల కేంద్రంలో వెలసిన సుంకలమ్మ దేవి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజాము నుంచే విశేష పూజలు, అర్చనలు జరిగాయి. గ్రామస్తులు అందజేసిన రూ.కోటి విరాళంతో నూతనంగా తయారు చేయించిన రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ మూర్తిని అధిష్టింపజేశారు. రథానికి పూజలు నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వరకూ లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు బళ్లారి జిల్లా నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలిరావడంతో విడపనకల్లు జనసంద్రమైంది. అలాగే కరకముక్కలలో వెలసిన చెన్నకేశవస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ తిమ్మప్ప స్వామి దేవాలయంలోనూ పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఎంపీపీ పుష్పావతి, సర్పంచ్ రామాంజనరెడ్డి, ఉపసర్పంచ్ ఆదమల్ల, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ నాయకులు కరణం భీంరెడ్డి, రామురెడ్డి, జగదీష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.