అనంతపురం అర్బన్: వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతున్నాయని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వడగాల్పులు (హీట్ వేవ్స్), వేసవి కార్యాచరణ ప్రణాళిక, నీటి సరఫరా, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రూపొందించిన పోస్టర్లను విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో ఉంచాలన్నారు. ఆస్పతులు, సీహెచ్‌సీల్లు, 108, 104 వాహనాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కుండలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పని ప్రదేశాల్లో షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మునిసిపాలిటీల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.
నీటి సరఫరాలో ఇబ్బంది రాకూడదు
తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి నిల్వలపై నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. నీటి వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి సమస్యపై కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
12 గంటల వరకే ఉపాధి పనులు
ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పనులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే చేయించాలని ఆదేశించారు. ప్రతి పంచాయతీలోనూ ఉపాధి పనులు కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. ఉపాధి పనులు జరిగే చోట తాగునీటి సదుపాయం, కూలీలు సేద దీరేందుకు షెల్టర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మునిసిపల్ ఆర్డీ పీవీవీఎస్‌ఎన్ మూర్తి, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎహసాన్‌బాషా, ఎస్‌డీసీ ఆనంద్, డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవి, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు నరసింహారెడ్డి, విజయలక్ష్మి, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, పశు సంవర్ధక శాఖ జేడీ సుబ్రమణ్యం, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఏపీఎస్‌పీడీసీఎల్ ఏడీ వివేకానందస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.