
ఒక్కటైన దంపతులతో న్యాయవాదులు
హిందూపురం అర్బన్: ఇద్దరూ ప్రభుత్యోగులే అయినా వివాహమైన కొంత కాలానికే విభేదాలు చోటు చేసుకుని వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఆ తర్వాత భార్య కావాలని భర్త, తనకు భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. చివరకు న్యాయవాదులు, కుటుంబసభ్యుల కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. వివరాలు... హిందూపురం మండలం చౌళూరు గ్రామానికి చెందిన నేత్రావతి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమెకు చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ జీపీ సూరితో కుటుంబ పెద్దలు పెళ్లి నిశ్చయం చేసి 2020, జూన్ 10న వేడుకగా వివాహం జరిపించారు. కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో తర్వాత విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో నేత్రావతి పుట్టింటికి చేరుకుంది. సూరి సైతం చైన్నెలోని తన బెటాలియన్‌లో విధుల్లోకి చేరి పోయారు. ఆ తర్వాత విడాకులు కోరుతూ భార్య కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో తనకు భార్య కావాలంటూ భర్త సైతం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇద్దరూ క్రమం తప్పకుండా వాయిదాలకు హాజరవుతూ వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ కలసి మాట్లాడుకుంటూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే న్యాయవాదులు, కుటుంబసభ్యులు నచ్చచెప్పడంతో ఇద్దరూ ఒక్కటయ్యేందుకు అంగీకరించారు. దీంతో శుక్రవారం ఉదయం ఇందిరా పార్క్‌లోని గణేష్ విగ్రహం ఎదుట న్యాయవాదులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఇకపై సఖ్యతగా ఉంటామని ప్రమాణం చేశారు. దంపతులు ఒక్కటవ్వడంతో న్యాయవాదులు, ఇరువైపులా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.