
శివకోటి ఆలయ గోపురంపై అభిషేకం చేస్తున్న స్వాములు
అనంతపురం కల్చరల్: నగరంలోని శివకోటి శ్రీపీఠంలో మహాకుంభాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శనివారం వందల సంఖ్యలో వేద పండితులు విచ్చేశారు. ఈ సందర్భంగా సామూహిక వేదపారాయణం, వేదమంత్రోచ్ఛారణలు, వివిధ రకాల హోమాలతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. శివకోటి వ్యవస్థాపకులు శివయ్యస్వామీజీ నేతృత్వంలో జరిగిన చండీ తర్పణం, వేదస్వస్తి, మంగళనీరాజనం ముగింపు వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఆత్మీయ అతిథులుగా హాజరై అమ్మవారికి మహా సంప్రోక్షణ చేశారు. మంత్రితో పాటు హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యుడు అశ్వత్థనాయక్, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మంజుల, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, బీసీ సెల్ జోనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ తదితరులకు ఆలయ నిర్వాహకులు వేదమంత్రాలు, బాజాభజంత్రీల నడుమ శ్రీవారి శేషవస్త్రాలనందించి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆదివారం పూర్ణాహుతితో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయని నిర్వాహకులు కోరారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో కూల్చేసిన ఆలయాలను తమ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా పునఃనిర్మిస్తోందని గుర్తు చేశారు. ఆలయ నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు సీఎం కావాలని శివకోటి ఆలయంలో జరిపిన ప్రత్యేక పూజల్లో కోరుకున్నానని చెప్పారు.


ప్రత్యేక అలంకరణలో లలిత శివ కామేశ్వరీ దేవి
Comments
Please login to add a commentAdd a comment