
అనంతపురం సెంట్రల్: దసరా పండుగ సందర్బంగా స్వగ్రామాలకు వెళ్లే సుదూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని సిబ్బందిని జిల్లా ప్రజారవాణా అధికారి సుమంత్.ఆర్.ఆదోని ఆదేశించారు. ప్రత్యేక బస్సు సర్వీసుల నిర్వహణపై మంగళవారం ఆయన తన చాంబర్‌లో జిల్లాలోని అన్ని డిపో మేనేజర్లతో సమీక్షించారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడంతో పాటు సంస్థకు ఆదాయం తీసుకురావడంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి బస్సు కండీషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సమయ వేళలు మార్చాలన్నారు. కార్గోలో స్వీకరించిన వస్తువులను వెంటనే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు అన్ని డిపోలలో డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కేఎంపీఎల్ పెంచాలని, బ్రేక్‌డౌన్ తగ్గించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీటీఎం రమేష్‌బాబు, డిప్యూటీ సీఎం మోహన్‌కుమార్, డిపోమేనేజర్లు నాగభూపాల్, శంకర్, రామచంద్ర, సురేష్‌కుమార్, నారాయణస్వామి, ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌లు వినయ్‌కుమార్, రమణమ్మ, పీవీ ప్రసాద్, ఎస్‌టీఐ నాగార్జున, ఏఎంఎఫ్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.