
అనంతపురం అర్బన్: మండల స్థాయి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని బుధవారం కణేకల్లులో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. కేసీఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటల నుంచి ‘జగనన్నకు చెబుదాం’, ‘స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
40 శాతం రాయితీతో
విత్తన పప్పుశనగ
అనంతపురం అగ్రికల్చర్: రబీ సాగుకు సంబంధించి 40 శాతం రాయితీతో రైతులకు విత్తన పప్పుశనగ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లరేగడి భూములు కలిగిన ప్రాంతాల రైతులు ఆర్‌బీకేల్లో విత్తనం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు 27,266 క్వింటాళ్ల విత్తన పప్పుశనగ కేటాయించారన్నారు. క్వింటాలు ధర రూ.8,100 కాగా.. అందులో 40 శాతం రాయితీ రూ.3,240 పోనూ రైతులు తమ వాటా కింద రూ.4,860 ప్రకారం చెల్లించాలని సూచించారు. బుధవారం నుంచి ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయన్నారు.