అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 10.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. నార్పల 65.2 మి.మీ, యల్లనూరు 48.8, తాడిపత్రి 32.4, శింగనమల 21.8, బుక్కరాయసముద్రం 21.4, గార్లదిన్నె 17.2, పుట్లూరు 17, విడపనకల్లు 13.2, పెద్దవడుగూరు 11.2 మి.మీ నమోదు కాగా.. మిగతా మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ఇప్పటి వరకు 90.6 మి.మీ నమోదైంది. మొత్తం మీద ఈ సీజన్‌లో 296.7 మి.మీ గానూ 24 శాతం తక్కువగా అంటే 223.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
మరో ఐదు రోజులు వర్ష సూచన
బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మంగళవారం తెలిపారు.