
అనంతపురం అర్బన్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నాణ్యమైన, బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. అయితే పేదల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని వ్యాపారులు బియ్యం తక్కువ ధరకు (కిలో రూ.12 నుంచి రూ.15 చొప్పున)సేకరిస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో మూడు రెట్లకు అధికంగా (రూ.40 నుంచి రూ.50 దాకా) విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని గమనించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల అధికారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక నిఘా ఉంచి అందిన సమాచారం మేరకు దాడులు చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై 6–ఏ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 136 కేసులు నమోదు చేసి, 6,305.09 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పేదలకు అందించే బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.38.50 ఖర్చు చేస్తోంది. అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2,42,74,250 ఉంటుంది.
చట్ట ప్రకారం నేరం
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా నేరం. ఏపీ స్టేట్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యుషన్ సిస్టమ్ (కంటోల్) ఆర్డర్–2018లోని 19లోని క్లాజ్ జీ ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయి. బియ్యం అమ్మిన కార్డుదారులపై క్రిమినల్ చర్యలతో పాటు కార్డు రద్దు చేస్తారు. క్లాజ్ హెచ్ ప్రకారం బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తారు.
పేదల బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా
జనవరి నుంచి ఇప్పటి వరకు 136 కేసులు
6,305.09 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
అక్రమ రవాణాదారులపై కేసులు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రభుత్వం సబ్సిడీతో బియ్యం ఇస్తోంది. ఇలా సబ్సిడీతో పొందిన వస్తువులను తిరిగి విక్రయించడం చట్ట ప్రకారం నేరం. అదే క్రమంలో ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పేదలకు ఇస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేయడమూ నేరం. పేదల నుంచి బియ్యం కొనుగోలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాం.
– శోభారాణి,
జిల్లా సరఫరాల అధికారి (డీఎస్‌ఓ)
ఈ ఏడాది మార్చి నెలలో గుంతకల్లు పట్టణంలో పామిడి–గుంతకల్లు రహదారిలోని ఇందిరమ్మ కాలనీలోని ఇంటి (ఇంటి నెంబరు 158, 159) ఆవరణలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 249.30 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులపై 6–ఏ కేసుతో పాటు కిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది మే నెలలో అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాళ్ల బియ్యాన్ని ఉరవకొండ పట్టణం గుంతకల్లు రోడ్డులోని మల్లేశ్వరి సినిమా థియేటర్ సమీపంలో విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
