
● జేఎన్‌టీయూ విద్యార్థిపై మూకుమ్మడి దాడి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల 76వ వార్షికోత్సవం వేడుకల్లో ప్రైవేట్ అల్లరి మూకలు హల్‌చల్ చేశాయి. కళాశాల విద్యార్థిపై ఏకంగా పది మందికి పైగా మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఘటనను కళాశాల అధ్యాపకుల దృష్టికి తీవ్రంగా గాయపడిన విద్యార్థి తీసుకెళ్లడంతో గురువారం ఉదయం అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు కళాశాల ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రవిశంకరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కళాశాలతో సంబంధం లేని వ్యక్తులు లోపలకు ఎవరు వెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నారు. గాయపడిన విద్యార్థితో మాట్లాడారు. గొడవకు దారి తీసిన కారణాలను ఆరా తీశారు. విద్యార్థి కళ్లజోడును తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి తిరిగి ఇవ్వకుండా తన స్నేహితులతో కలసి దాడికి దిగినట్లుగా తెలిసింది. ఆ సమయంలో దాడిని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాకుండా భయభ్రాంతులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్ట్
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: వృద్ధురాలిని హతమార్చిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ గురువారం వెల్లడించారు. అనంతపురంలోని ఆజాద్ నగర్‌లో నివాసముంటున్న బాషాకు 2018లో గుంతకల్లుకు చెందిన ఉమెరా సుల్తానాతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉమెరా సుల్తానా, అత్త సర్దార్‌బీ (57) మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. దీంతో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుని గుంతకల్లులోని తన సోదరుడు వన్నూరువలితో కలసి పథకం రచించింది. బుధవారం రాత్రి మామ ఇస్మాయిల్, భర్త బాషా పనిపై బయటకు వెళ్లిన సమయంలో తమ్ముడు వన్నూరు వలిని ఇంటికి రప్పించుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సర్దార్‌బీ గొంతుకు వైర్ బిగించి హతమార్చారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హతమార్చి బంగారు నగలు అపహరించుకెళ్లినట్లు ఉమెరా సుల్తానా నాటకానికి తెరలేపింది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం తెలుగు చూసింది. దీంతో గురువారం సాయంత్రంరుద్రంపేట సమీపంలో వన్నూరు వలిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ద్విచక్ర వాహనంతో పాటు రెండు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన వైరు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.




