
మహాజనసభలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్‌పర్సన్ ఎం.లిఖిత
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఆర్థిక పటిష్టతకు చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా రూ.71 కోట్ల మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని డీసీసీబీ ఉద్యోగులను ఆ బ్యాంక్ చైర్‌పర్సన్ ఎం.లిఖిత ఆదేశించారు. శనివారం స్థానిక డీసీసీబీ హాలులో బ్యాంక్ సీఈఓ ఏబీ రామ్‌ప్రసాద్ అధ్యక్షతన డీసీసీబీ 124వ మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా లిఖిత మాట్లాడుతూ... 6.72 శాతం ఉన్న మొండిబకాయిల వసూళ్లకు సరైన కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు మరింత నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు, రుణాలు అందించేందుకు వీలుగా వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించాలన్నారు. డిపాజిట్లుపై అందజేస్తున్న వడ్డీరేట్లపై ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. వివిధ పథకాల అమలులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించిన భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకుంటే సహకార బ్యాంకులు, సొసైటీలు ఆర్థిక పరిపుష్టి సాధించడం ఖాయమన్నారు. ఇటీవల సహకార చట్టంలో సవరణలు చేశారని, అందులో ఆర్‌బీకేలను సొసైటీలతో అనుసంధానం చేయడం, సొసైటీల్లో ఇక నుంచి రెండు అడిట్లు నిర్వహించడం, సంఘాలతో విచారణ చేపట్టాలంటే ఫైనాన్సియల్ బ్యాంక్ ఆమోదం తీసుకోవడం, సహకార సంఘాల్లో ఏ సభ్యుడైతే వ్యాపారం చేస్తారో వారికే ఓటు హక్కు కల్పించడం, బ్యాంకు సీఈవోల నియామకానికి స్టేట్ లెవెల్ ప్యానెల్ ఏర్పాటు, కామన్ సర్వీసు సెంటర్ల ఏర్పాటు ద్వారా బస్సు, రైలు, విమానం టికెట్ల సదుపాయం కల్పించడం, ప్రతిసంఘం కంప్యూటరీకరణ చేపట్టి క్యూఆర్ కోడ్ కల్పించడం లాంటి సవరణల గురించి అధ్యయనం చేయాలన్నారు. పాలకవర్గం, అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని పిలుపునిచ్చారు. మహాజన సభలో రెండు జిల్లాల డీసీఓలు ఎం.ప్రభాకరరెడ్డి, కృష్ణానాయక్, నాబార్డు డీడీఎం అనురాధ, డైరెక్టర్లు శంకరరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రామాంజినేయులు, ప్రొఫెషనల్ డైరెక్టర్లు రమణమూర్తి, అబ్దుల్‌రఖీద్, బ్యాంకు జీఎం కె.సురేఖారాణి, డీజీఎంలు సుఖదేవబాబు, రవికుమార్, పి.యాలేరు సొసైటీ అధ్యక్షుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.