
అనంతపురం సెంట్రల్: ఏపీఎస్ ఆర్టీసీలో డీజిల్ అక్రమాలకు చెక్ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రిటైల్‌గా కొనుగోలు చేస్తున్న విధానాన్ని నిలిపి వేస్తూ హోల్‌సేల్‌గా కంపెనీల నుంచే నేరుగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంతకాలంగా ఆర్టీసీలో డీజిల్ సరఫరాలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు పుల్‌స్టాప్ పడినట్లయ్యింది.
రోజుకు 29,468 లీటర్ల డీజిల్ వినియోగం
ప్రజా రవాణా వ్యవస్థలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల పరిధిలో దాదాపు 393 బస్సులు నడుస్తున్నాయి. వీటికి రోజుకు సగటున 29,468 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు బస్సుల మైలేజీపైనే అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా గతంలో పనిచేసిన అధికారులు హోల్‌సేల్ కన్నా రిటైల్‌గా తక్కువకే డీజిల్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. స్థానిక డీలర్ల నుంచే ఇంత కాలం డీజిల్ కొనుగోలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పలువురు అధికారులు తావిస్తూ వచ్చారు.
ప్రభుత్వం కళ్లు గప్పి
డీజిల్‌ను రిటైల్‌గా కొనుగోలు చేసే అంశం కొందరు అధికారులకు కాసుల వర్షమే కురిపించింది. నిబంధన మేరకు స్థానిక డీలర్ల నుంచి కాకుండా ధర తక్కువగా ఉన్న కర్ణాటకలో కొనుగోలు చేసి, స్థానిక అధిక ధరను కోట్ చేసి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలు ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో బట్టబయలయ్యాయి. దీని వల్ల డీజిల్ క్రయవిక్రయాల్లో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన జీఎస్టీ నిధులకు గండికొట్టినట్లైంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం డిపోలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అనంతపురం, గుత్తి, కళ్యాణదుర్గం డిపోలకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), తాడిపత్రికి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) లిమిటెడ్ నుంచి డీజిల్ సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.
రిటైల్ కొనుగోళ్ల నిలుపుదల
కంపెనీల నుంచి హోల్‌సేల్‌గా కొనాలని ప్రభుత్వ తాజా నిర్ణయం
మూడు కంపెనీలకు సరఫరా బాధ్యతలు
ప్రభుత్వ నిర్ణయం మేరకే
ఏపీఎస్ ఆర్టీసీలో డీజల్ వినియోగమనేది చాలా కీలకం. గతంలో సంస్థకు ఆదాయం తీసుకురావాలనే ఉద్దేశంతో రిటైల్‌గా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు రిటైల్‌గానే కొనుగోలు చేశాం. తాజాగా ఆయా కంపెనీల నుంచి డిపోలకు నేరుగా సరఫరా చేసేలా టెండర్లు ఖరారు చేశారు. త్వరలో హోల్‌సేల్ ధరతో డీజిల్ సరఫరా కానుంది.
– సుమంత్.ఆర్.ఆదోని, ఆర్‌ఎం, ఏపీఎస్ ఆర్టీసీ
