మామిడీలా.. | - | Sakshi
Sakshi News home page

మామిడీలా..

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

రూ.లక్షలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి తోటలు కొనుగోలు చేసి, కమీషన్‌ దుకాణాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది దిగుబడి పర్వాలేదు.అయితే నాణ్యమైన కాయలు రాకపోవడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడంలేదు. లోకల్‌మార్కెట్‌లోనే విక్రయించవలసి వస్తోంది. కమీషన్‌ దుకాణాలు కూడా తగ్గిపోయాయి. వ్యాపారాలు మానుకునే పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచే మామిడి ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. నక్కపల్లి మండలంలో జాతీయ రహదారి పక్కన చినదొడ్డిగల్లు, కాగిత, వేంపాడు పరిసర ప్రాంతాల్లో సుమారు 16 వరకు కమీషన్‌ దుఖాణాలు ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలు, మండలాల నుంచి కూడా ఇక్కడకు మామిడి కాయలు తెచ్చి విక్రయిస్తారు. ఇక్కడ కమీషన్‌ దుకాణాల యజమానులు వాటిని కటక్‌, భువనేశ్వర్‌, కోల్‌కతా,విశాఖప ట్నం, విజయవాడ, చైన్నె తదితర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. డిసెంబర్‌ నుంచే ఇక్కడ కమీషన్‌ దుకాణాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

దిగజారిన ధరలు ● మందగించిన ఎగుమతులు వెలవెల బోతున్న కమీషన్‌ దుకాణాలు ● నష్టాల్లో రైతులు, వ్యాపారులు

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు

నాకు 50 సెంట్ల మామిడి తోట ఉంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు పురుగుమందులు జల్లేందుకు, ఎరువుల కోసం రూ.6వేల పెట్టుబడి పెట్టాను. దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. నాణ్యమైన కాయలు రావడం లేదు. వీటినికొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.దీంతో ఎంతో కొంత ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు.

– సఖిరెడ్డి వెంకటరావు, చినరామభద్రపురం

నాణ్యమైన కాయలు రాలేదు

– తోట సత్తిబాబు, కమీషన్‌ వ్యాపారి

అధికంగా పురుగు మందులు వాడడం వల్లే

ఏడాది మామిడి దిగుబడి, కాయల్లో నాణ్యత తగ్గాయి. పురుగుమందులు, రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. తోటల్లో ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ సమస్య ఉండదు. తోటను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి, చెత్తను తొలగించి సకాలంలో దుక్కులు, నీరుఏర్పాటు చేస్తే తెగుళ్లబారినుంచి కాపాడుకోవచ్చు. తోటలకు గాలి ,వెలుతురు కూడా ఉండాలి. రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టిసారిస్తే మంచి దిగుబడి,నాణ్యమైన కాయలు లభించే అవకాశం ఉంది.

– సాయిప్రియ, ఉద్యానవన శాఖాధికారి, పాయకరావుపేట

నక్కపల్లి: ప్రతి ఏటా మామిడీ సీజన్‌లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచే అత్యధికంగా ఎగుమతులు జరిగేవి. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల ప్రభావం కారణంగా ఈ ఏడాది నాణ్యమైన మామిడి కాయలు లభ్యం కాలేదు. దీని ప్రభావం ఎగుమతులపై పడింది. సీజన్‌ ప్రారంభంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని మామిడి రైతులు ఆందోళన చెందారు. తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో కాపు కొంత బాగుంది. అయితే నాణ్యమైన కాయలు లభించలేదని రైతులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, పొగమంచు తదితర కారణాల వల్ల దిగువ భాగంలో పుచ్చు, మచ్చరావడంతో నాణ్యమైన కాయలు లభించలేదు. ఈ ఏడాది దిగుబడి ఉన్నప్పటికీ నాణ్యమైన కాయలు రాకపోవడంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, కటక్‌, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో స్థానికంగా ఆశాజనకంగా దిగుబడి రావడంతో ఉత్తరాంధ్ర ఎగుమతులపై ప్రభావం చూపిందని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకు మామిడి సీజన్‌ ఉంటుంది. డిసెంబరు నెలాఖరు నాటికే పూత వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పొగమంచు, తెగుళ్ల కారణంగా చాలా చోట్ల నాణ్యమైన కాయలు లభించలేదు.

25వేల ఎకరాల్లో సాగు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 25వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాలు, పాయకరావుపేట మండలంలో మూడు వేల ఎకరాలు, కోటవురట్ల మండలంలో మూడు వేల ఎకరాలు, ఎస్‌.రాయవరం మండలంలో నాలుగు వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. నాతవరం, కొయ్యూరు, గొలుగొండ, పద్మనాభం, నర్సీపట్నం, యలమంచిలి, మాడుగుల, రాంబిల్లి, కోటపాడు, చోడవరం మండలాల్లో దాదాపు 12వేల ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 4నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

10శాతం తగ్గిన దిగుబడి

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రతిఏటా 1.25లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. కానీ ఉద్యానవన శాఖాధికారులు మాత్రం 75 శాతం దిగుబడిని మాత్రమే లెక్కకడతారు.ఈ లెక్కన దాదాపు 80 నుంచి 90వేల టన్నులు దిగుబడి అంచనా వేస్తారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల వల్ల 65శాతం దిగుబడి వస్తుందని అంచన వేశారు.

దక్షిణాది నుంచి రాని ఆర్డర్లు

తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాలతోపాటు చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో లోకల్‌గా పండిన మామిడి కాయలు ఎక్కువగా రావడంతో ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఆర్డర్లు రావడం లేదని వ్యాపారులు, రైతులు తెలిపారు.ఆయా ప్రాంతాలత్లో నాణ్యమైన కాయలు రావడం, ధరకూడా అందుబాటులో ఉండటం వల్ల ఆర్డర్లు రావడం లేదని రైతులు చెబుతున్నారు.ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎగుమతి ఎక్కువగా జరిగేది. ఈ ఏడాది అదీకూడా తగ్గిపోయిందని చెబుతున్నారు.

కలెక్టర్‌ రకంపై నిరాసక్తత

కలెక్టర్‌ రకం కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడంతో జ్యూస్‌ ఫ్యాక్టరీలకు తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కొత్తపల్లి కొబ్బరి రకం ఈ ఏడాది కాపు బాగా ఉందని టోకు పద్ధతిలో కిలో రూ.50లకు విక్రయిస్తున్నామని రైతులు తెలిపారు. బంగినపల్లి రకం విశాఖపట్నంలో బాక్సు (21కిలోలు) రూ.500ల చొప్పున విక్రయించాల్సి వస్తోందన్నారు.

10 ఎకరాలు... రూ.1.50లక్షలు

పది ఎకరాల మామిడి తోట నుంచి ఏడాది ఫలసాయం తీసుకునేందుకు రూ.1.50లక్షలు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.పురుగుల మందు పిచికారీ, ఎరువులు తదితర ఖర్చులు, కాయల కోత ఖర్చు మరో రూ. 50 వేలు అవుతుందన్నారు. ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి నాణ్యమైన దిగుబడి రావడం లేదంటున్నారు.

ఎగుమతికి సిద్ధం చేస్తున్న మామిడి పండ్లు, వ్యాపారంలేక ఖాళీగా ఉన్న కమీషన్‌ దుకాణం

పడిపోయిన ఎగుమతులు

ప్రతిఏటా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సుమారు 40 వేల టన్నుల ఎగుమతులు జరిగేవి. మే రెండోవారంలో ఈ కమీషన్‌ దుకాణాల నుంచి రోజుకు 500 టన్నుల చొప్పున ఎగుమతులు జరిగేవి. కానీ ఈ సీజన్‌లో ఇతర రాష్ట్రాలనుంచి వ్యాపారులు రాకపోవడంతో ప్రస్తుతం రోజుకు 100 టన్నులు కూడా ఎగుమతి చేయడం కష్టంగా ఉందని కమీషన్‌ వ్యాపారులు వాపోతున్నారు.గత ఏడాది మే నెలాఖరు నాటికి 20 వేల టన్నులకు పైగా ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది ఐదు వేల టన్నులు కూడా ఎగుమతి చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. గతంలో ఐషర్‌ వ్యాన్‌లు, లారీల్లో ఎగుమతులు చేసేవారమని, ఇప్పుడు బొలేరో వాహనాల్లో మాత్రమే ఎగుమతులు చేస్తున్నామని వారు చెబుతున్నారు.

ఒడిశా, కోల్‌కతా ప్రాంతాల్లో తక్కువ ధరకు..

గతంలో ఇతర రాష్ట్రాలనుంచి వ్యాపారులు కమీషన్‌ దుకాణాల వద్దకు వచ్చి తమకు కావాల్సిన సరుకును ఇక్కడ నిర్ణయించిన ధరలకు ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసే వారు.ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఒడిశా, కోల్‌కతా ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌లోనే మామిడి అధికంగా, కిలో రూ.10లకే లభిస్తుండటంతో వ్యాపారులు కమీషన్‌ దుకాణాల వద్దకు రావడం లేదు.ఎగుమతి చేయాలంటే రవాణా ఖర్చులు పెట్టుబడులు కలిపి కిలో రూ.25కు విక్రయించాలి.అంత ధరపెట్టి వ్యాపారులు కొనడంలేదు. వ్యాపారులు స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాయకరావుపేట నియోజకవర్గంలో కమీషన్‌ వ్యాపారులు, రైతులు తుని, అనకాపల్లి, విశాఖపట్నం, అడ్డురోడ్డు, కాకినాడ రాజమండ్రి తదితర ప్రాంతాలకు వాహనాల్లో తరలించి అక్కడే వచ్చినకాడకి విక్రయిస్తున్నారు.

పాయకరావుపేట నుంచే అధికం

ఈ ఏడాది మామిడి వ్యాపారం కుదేలైంది. వాతావరణ ప్రభావం, తెగుళ్ల వల్ల కాయల్లో నాణ్యత తగ్గింది.. ఎగుమతులు మందగించాయి.. దిగుబడి ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడంతో రైతులు, కమీషన్‌ వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

టన్ను ధర ఇలా...

మామిడి రకం గత ఏడాది ఈ ఏడాది

బంగినపల్లి రూ.35వేలు రూ.25వేలు

కలెక్టర్‌ రూ.25 వేల–రూ.30వేలు రూ.7వేలు

సువర్ణరేఖ రూ.50వేలు రూ.30వేలు

ఇతర రకాలు రూ.15వేలు రూ.5 వేల–రూ.8వేలు

Advertisement
 
Advertisement
Advertisement