ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న
ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు
అనకాపల్లి: ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే సహించబోమని ప్రజారవాణాశాఖ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి జి.వి.రమణ అన్నారు. స్థానిక డిపో గ్యారేజీ గేటువద్ద మధ్యాహ్న భోజన విరామసమయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రేవేటీకరణ చేయడం వల్ల బలహీన వర్గాల ప్రయాణిలకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఉద్యోగుల పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీచేయాలని, సీ్త్రశక్తి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, రద్దీని దృష్టిలో పెట్టుకుని 3 వేల బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆర్టీసీని ధారాదత్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకురాలు ఒ.ఆర్.కళ, యూనియన్ నాయకులు శ్రీను, కె.ఎం.రావు, వేపాడ శ్రీను, డి.వి.గణేష్, జి.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


