మట్టి వ్యాపారం ‘పచ్చ’గా... | - | Sakshi
Sakshi News home page

మట్టి వ్యాపారం ‘పచ్చ’గా...

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

చెరువులు గుల్ల చేస్తున్న టీడీపీ నేతలు

ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

కోటవురట్ల : అడ్డదారులు తొక్కేందుకు పచ్చనేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మనల్ని ఆపేదెవడు అంటూ పేట్రేగిపోతున్నారు. వరాహనది నుంచి ఇసుక, కొండలను తవ్వేసి గ్రావెల్‌ తరలించుకుపోతుండగా ప్రస్తుతం పలువురి టీడీపీ నేతల దృష్టి మట్టిపై పడింది. చెరువులను జంకూ గొంకూ లేకుండా తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెట్టుబడి లేకుండా మట్టి వ్యాపారం రూ.లక్షలు తెచ్చిపెడుతుండడంతో మండలంలోని పలువురి టీడీపీ నేతల కన్ను చెరువులపై పడింది. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తమకేమీ తెలియనట్టు మిన్నకుండిపోవడంతో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.2500లకు విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. బి.కె.పల్లి, రామచంద్రపాలెం రెవెన్యూ పరిధిలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు పచ్చనేతలు పొక్లెయిన్‌, ట్రాక్టర్లతో చెరువులో వాలిపోతున్నారు. అడ్డేవారు లేకపోవడంతో తెల్లవార్లూ మట్టిని తవ్వేసి తరలించుకుపోతున్నారు. ఆదివారం రాత్రి రామచంద్రపాలెంలోని ఎర్ర చెరువులో గ్రామానికి చెందిన టీడీపీ నేత నేరుగా పొక్లెయిన్‌తో మటి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో తాజా మాజీ సర్పంచ్‌ పరదేశమ్మ భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు తమరాన కన్నంనాయుడు అడ్డగించారు. చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి అడ్డగించారు. దాంతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్టు కన్నబాబు తెలిపారు. కన్నబాబు మాట్లాడుతూ చెరువులో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి 5 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తవ్వగా అడ్డుకున్నామని, తిరిగి ఆదివారం కూడా తవ్వకాలు జరపడంతో అడ్డుకుని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్‌ చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు స్పందించలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement