దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఉరి వేసుకుని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నారిపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని సుమారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మృతుడు అనంతపురం జిల్లా వాసి


