యలమంచిలి రూరల్: మండలంలోని జంపపాలెం సమీపంలో మొండి గెడ్డ చెరువులో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొక్లెయిన్‌తో మట్టి తవ్వకాలు చేపట్టడంపై ఆ గ్రామానికి చెంది దాడి జగ్గ అప్పలనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని ఫిర్యాదుచేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలను రెవెన్యూ అధికారులకు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు. తహసీల్దార్ వరహాలు స్పందించి అక్కడకు వెళ్లాల్సిందిగా వీఆర్వో నూకరాజు,వీఆర్‌ఏలు రమాదేవి,అప్పారావులను ఆదేశించారు.వాళ్లు అక్కడకు వెళ్లేసరికే అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులు వాహనాలతో పరారయ్యారు.అయితే అప్పటికే కొంత మట్టిని తరలించుకుపోయారు.తాను ఆరు నెలల క్రితమే మొండి గెడ్డలో పూడిక తీయిస్తానని జలవనరుల శాఖ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని,కానీ తనకు అనుమతి ఇవ్వకపోగా ఇప్పుడు అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని అప్పలనాయుడు ప్రశ్నించారు.అదేవిధంగా చెరువు గట్టుపై యూకలిప్టస్ చెట్లను కొందరు నరికి పట్టుకుపోయారన్నారు.అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


