తర్లువాడ రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం
గూగుల్ డేటా సెంటర్ కోసం నాడు త్యాగాలు
నేడు ఆఫీసుల చుట్టూ తిప్పలు
ఇళ్ల స్థలాల పేరుతో వీఆర్‌ఓల ముమ్మర తనిఖీలు.. డాక్యుమెంట్ల వేధింపులు
నష్టపరిహారం ఇవ్వకుండా కొర్రీలు పెట్టడమేంటని బాధితుల ప్రశ్న
ఆనందపురం: అభివృద్ధి పేరుతో నాడు విలువైన భూములను గుంజుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. నేడు ఆ బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో కొర్రీలతో వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించే విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. డీఆర్‌డీఏ స్లిప్పులు ఉన్న 520 మంది రైతులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి.. ఇపుడు తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిబంధకంగా మారిన తనిఖీలు
తహసిల్దార్ ఎస్.శ్రీనుబాబు ఆదేశాల మేరకు శనివారం 15 మంది గ్రామ రెవెన్యూ అధికారుల బృందం గ్రామంలో ముమ్మరంగా అర్హుల వెరిఫికేషన్ పేరిట తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళుతూ, గతంలో ప్రభుత్వం ఇచ్చిన డీఆర్‌డీఏ స్లిప్ నంబర్లతో సరిపెట్టకుండా.. ఆధార్ నంబర్, బియ్యం కార్డు నంబర్, ఇంటి పన్ను రశీదు నంబర్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా, గతంలో వీరికి ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకం ఏమైనా వచ్చిందా లేదా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.
హక్కుగా రావాల్సిన పరిహారానికి అర్హతలా?
గూగుల్ డేటా సెంటర్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా నేరుగా నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి, ఇప్పుడు కొత్తగా ఇన్ని కొర్రీలు, తనిఖీలు చేయడాన్ని రైతులు నిలదీస్తున్నారు. గతంలో ఇళ్లు వచ్చి ఉంటే ఇప్పుడు నష్టపరిహారం కింద ఇచ్చే ఇళ్ల స్థలాన్ని నిరాకరిస్తారా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ బేషరతుగా పరిహారం ఇవ్వాలే తప్ప, ఇలా సంక్షేమ పథకాల తరహాలో వడపోత కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
లబ్ధిదారుల్లో అయోమయం
మరోవైపు, గ్రామంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులైన రైతుల పేర్లను అధికారులు వెరిఫై చేయాల్సి ఉంది. ఈ ముసుగులో ఎక్కడ తమ పేర్లను జాబితా నుంచి తొలగిస్తారోననే భయం మిగిలిపోయిన రైతుల్లో నెలకొంది. కాలయాపన చేయకుండా తమ పేర్లను కూడా తనిఖీ చేసి, ఈ అసంబద్ధ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, తమకు దక్కాల్సిన న్యాయమైన నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలని బాధితులు రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


