దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

మాడుగుల రూరల్‌: తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వృద్ధుడు 12 రోజులైనా తిరిగి ఇంటికి చేరలేదు. మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన కోరుకొండ కళ్యాణం అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాడి పెంటయ్యతోపాటు అతడు ఈ నెల 1న వృద్ధాప్య పింఛను తీసుకుని 4వ తేదీన అనకాపల్లిలో తిరుమల రైలు ఎక్కి 5వ తేదీన తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెంగమాంబ భోజన శాల వద్ద భోజనాలు చేశారు. పెంటయ్య తన బ్యాగ్‌ను కళ్యాణంకు ఇచ్చి చేతులు కడుక్కోని వచ్చేలోగా కనిపించలేదు. బ్యాగ్‌లో నగదు, బట్టలు ఉండటంతో పెంటయ్య ఆందోళనకు గురయ్యాడు. అక్కడ మైక్‌లో అనౌన్స్‌ చేసినా ఆచూకీ తెలియరాలేదు. తర్వాత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి గాలించినా సరే జాడలేదు. దీంతో పెంటయ్య కట్టుబట్టలతో తిరిగి ఈ నెల 14వ తేదీన స్వగ్రామం వీరనారాయణం చేరుకున్నాడు. ఈ విషయం కళ్యాణం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement