స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

● విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న బైక్‌ ● కేబీ రోడ్డులో ప్రమాదం ● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

బుచ్చెయ్యపేట: మండలంలో కశింకోట– బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో నీలకంఠాపురం వద్ద విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనకాపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు స్నేహితులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్నారు. రాజాం గ్రామానికి చెందిన మరిసా శివ పని మీద అనకాపల్లి వెళ్లాడు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో తన స్నేహితులైన మరిసా సాయి, పడాల శివకు ఫోన్‌ చేసి తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని కోరాడు. స్నేహితుడిని తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై మరిసా సాయి, పడాల శివ అనకాపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు వస్తుండగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. 108 వాహనంలో పడాల శివ, మరిసా శివలను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడి కారులో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్తున్న మరిసా సాయి(20) జంగాలపాలెం గ్రామ దగ్గర ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో పడాల శివ కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరిసా శివ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివాహమైన ఏడాదికే..

మరిసా సాయి తురకలపూడికి చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి తన గ్రామంలో పొలం అమ్మడానికి 20 రోజుల క్రితం భార్యతో కలిసి రాజాం వచ్చాడు. రెండు రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్‌ అయింది. మళ్లీ హైదరాబాద్‌ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహితుడు అనకాపల్లిలో ఉండిపోవడంతో అర్ధరాత్రి తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య మాధవి ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. భర్త మృతితో ఆమె రోదిస్తున్న తీరును చూసి పలువురు చలించిపోయారు. సాయి తల్లి లచ్చమ్మ అనారోగ్యంతో మంచాన ఉండగా, తండ్రి సన్యాసినాయుడు కుమారుడు మృతితో భోరున విలపిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి, సాయంత్రం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేబీ రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నా ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement