కె.కోటపాడు: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 80 వన నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 89 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ అధికారి(డీఎఫ్‌వో) ఎం.సోమసుందరం తెలిపారు. కె.కోటపాడు మండలం కొత్తూరు, ఎ.కోడూరు, సింగన్నదొరపాలెం, రామచంద్రపురం, పొడుగుపాలెం, బత్తివానిపాలెం గ్రామాల్లో వన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సరీల్లో మొక్కలకు నీటి తడులను తరచూగా ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ఏయే మొక్కలు రైతులకు, ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పరిశ్రమలకు నిర్దేశించిన ధరలకు ఈ మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెంచుతున్న మొక్కల్లో 70 లక్షల సరుగుడు మొక్కలతోపాటు మిగిలిన 19 లక్షలు జీడి, మహగణి, ఎర్రచందనం, ఏగిస, యూకలిప్టస్, నేరేడు, రోజ్‌వుడ్, కందంబ, ఫెల్టోఫారం తదితర మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గతేడాది రోడ్లకిరువైపులా రహదారి వనాల కార్యక్రమంలో బాగంగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు బ్లాక్ ఫ్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(సింహాద్రి) నిధులతో రహదారి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వీబీ జీ రాంజీ, ఎన్టీపీసీ, ఆగ్రో ఫారెస్ట్రీ, కాంపా నిధులతో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు.


