రెచ్చిపోతున్న మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్ఛగా దోపిడీ

టీడీపీ నేతల ఒత్తిళ్లతో అటు చూడని అధికారులు

ఫిర్యాదు చేసినా ఆగని తవ్వకాలు,తరలింపు

యలమంచిలి రూరల్‌: ప్రభుత్వం మాది ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది, దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి..చూద్దాం అంటూ కొందరు టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యలమంచిలిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరిపి, అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు,వాగులు,వంకలు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్టు ఇలా దేన్నీ వదలడం లేదు. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా,ఫిర్యాదు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తయిన చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

పంట కాలువలో పూడికతీత పేరుతో..

యలమంచిలి జలవనరుల శాఖ పరిధిలో యలమంచిలి పంట కాలువలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ నిధులు రూ.9.6 లక్షలతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆయా నీటి సంఘాల పాలకవర్గాలతో ఈ పనులు చేయిస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వలో పూడికతీత సమయంలో భారీగా కలప,మట్టి దోపిడీ జరిగింది.కాలువకు రెండువైపులా ఏపుగా పెరిగిన చెట్లను యంత్రాలతో కూల్చి, వందల టన్నుల కలపను అక్రమంగా అమ్ముకున్నారు. మట్టి దోపిడీ కూడా భారీగా జరుగుతోంది.కాలువ నిర్వహణ పనుల పేరుతో అక్రమంగా మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించి అమ్ముకుంటున్నారు. తాజాగా శుక్రవారం పంటకాల్వకు ఆనుకుని ఉన్న బ్రాంచి కాల్వలో పూడికతీత పేరుతో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి నాలుగు ట్రాక్టర్లతో సమీపంలో ఇటుకబట్టీలకు తరలించారు.అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఎవరైనా విలేకరులు ఇలాంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సవాలక్ష ప్రశ్నలు వేస్తూ ధీమాగా ఉంటున్నారు. యలమంచిలి పంట కాలువ పూడికతీత పనుల్లో కలప,మట్టి తరలింపుపై జంపపాలెంకు చెందిన ఒక సామాజిక కార్యకర్త కలెక్టరుకు ఫిర్యాదు చేసినా అక్రమాలేవీ జరగలేదని అధికారులు సమాధానమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

చర్యలు తీసుకుంటాం

యలమంచిలి పంటకాలువ,కృష్ణాపురం బిళ్వకుమారి చెరువులో మట్టి తవ్వకాలు అక్రమంగా జరుపుతున్నట్టు మాదృష్టికి రాలేదు. మట్టి తవ్వకాలపై పరిశీలన జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.మట్టి అమ్ముకోవడానికి నిబంధనలు అనుమతించవు.ఫిర్యాదులపై విచారణ జరుపుతాం.

–ఎన్‌ ప్రేమ్‌కుమార్‌, ఏఈఈ,జలవనరుల శాఖ,యలమంచిలి

బిళ్వకుమారి చెరువులో తవ్వకాలపై జనసేన నేత ఫిర్యాదు

యలమంచిలి మండలం కృష్ణాపురం రెవెన్యూ పులపర్తి ప్రధాన కాల్వ నుంచి సాగునీరు ప్రవహించే బిళ్వకుమారి చెరువులో రాత్రీ పగలూ తేడా లేకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పులపర్తికి చెందిన జనసేన నేత,పులపర్తి సాగునీటి సంఘం అధ్యక్షుడు సుంకర బుల్లిబాబు శుక్రవారం కలెక్టర్‌,యలమంచిలి తహసీల్దార్‌,యలమంచిలి జలవనరుల శాఖ డీఈఈ,యలమంచిలి జలవనరుల శాఖ ఏఈఈలకు ఫిర్యాదు చేశారు.గుంటూరు జిల్లా పన్నూరు గ్రామస్తుడు మోటూరు శేషారావుకు చెందిన 2.26 ఎకరాల పొలాన్ని మట్టితో చదును చేసేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకుని, 10రోజులుగా రెండు భారీ ఎక్స్‌వేటర్లు, టిప్పర్‌ లారీలు,పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని పెద్ద ఎత్తున తవ్వి అక్రమంగా తరలించుకుని అమ్ముకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 2,000 ట్రిప్పుల మట్టిని కొల్లగొట్టినా స్థానిక జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఓ టీడీపీ నేత చేస్తున్న మట్టి అక్రమ తవ్వకాలపై జనసేన నేత అధికారులకు ఫిర్యాదు చేశారంటే ఇక్కడ మట్టి మాఫియా ఎలా చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement