ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందుకుంటున్న కార్యదర్శి సూర్యకళ, తాజా మాజీ సర్పంచ్ కన్నయ్యనాయుడు
నర్సీపట్నం : ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ఉత్తమ గ్రామంగా పేరుపొందిన నర్సీపట్నం మండలం, ధర్మసాగరం పంచాయతీ అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్(ఐఎస్‌ఓ) గుర్తించింది. జిల్లాలో ధర్మసాగరం తుది జాబితాలో ఎంపిక కాబడింది. ఐఎస్‌ఓ 9001–2015 సర్టిఫికెట్‌ను టాటా క్వాలిటీ సెర్ట్ సర్వీసెస్ ప్రతినిధి సలీం, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి చెందిన కళ్యాణి గురువారం పంచాయతీ కార్యదర్శి సూర్యకళ, తాజా మాజీ సర్పంచ్ గొంప కన్నయ్యనాయుడుకు అందజేశారు. పంచాయతీ పరిపాలనలో కార్యాలయం పనితీరు, ప్రజలకు అందించే సేవలు, రికార్డులు, పారిశుధ్యం, తాగు నీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, ప్రజలతో ఉద్యోగుల సత్‌ప్రవర్తన, మెరుగైన ప్రజా సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్నందున ఐఎస్‌ఓ 9001–2015 సర్టిఫికెట్ వరించింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుకల రమణమ్మ, ఎంపీడీవో సిహెచ్.ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవో రమా కుమారి, మాజీ ఉపసర్పంచ్ వెంకటలక్ష్మి, అప్పలనాయుడు, చినబాబు పాల్గొన్నారు.


