భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

● రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం

అనకాపల్లి: జిల్లాలో పెండింగ్‌లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగరంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో జిల్లాలోని ఎస్సీ సంక్షేమ భూములకు సంబంధించిన భూ కబ్జా, సర్వే కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులకు సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ద్వారా తదుపరి చర్యల కోసం లేఖలు పంపించామన్నారు. 54 మంది ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సబ్బవరపు గణేష్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ బి.రామానందం, డీవీఎంసీ సభ్యులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూ వివాదంపై విచారణ

దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లిలో రెవెన్యూ పరిధిలో దళితులు, కల్లుగీత కార్మికులు మధ్య నెలకొన్న భూ వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన కణితి అర్జున్‌ ముషిడిపల్లిలోని తన భూ సమస్యపై రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ సూచనల మేరకు సదరు వివాదాస్పద స్థలాన్ని స్థానిక తహసీల్దార్‌ పి.లక్ష్మీదేవి, ఎస్‌ఐ వి. సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సదరు స్థలానికి సంబంధించి ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించారు. ఇరువర్గాల వారి వాదనలను వినడంతో పాటు స్థానిక పెద్దలను, అధికారులను సైతం భూమికి సంబంధించిన పూర్వపరాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వారు పరస్పర వాదోపవాదనలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement