యలమంచిలి రూరల్ : పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పర్చుకున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి కోడిగుడ్డు సన్యాసిరావు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. యలమంచిలి పట్టణ ఠాణాలో 2023లో రెండు, 2024 నాగుల చవితి జాతర రోజు ఒకటి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను నిందితుడు అపహరించాడు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మూడు కేసుల్లో నిందితుడిగా సన్యాసిరావును పోలీసులు నిర్థారించుకున్నారు. గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పెదపల్లి కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మూడు వాహనాలను పోలీసులు రికవరీ చేశారు.


