మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటన

● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటన

పార్వతి మృతదేహం

తాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని పీఆర్‌కే నాగ్‌ ఆనంద్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్‌షాప్‌ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్‌ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్‌లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్‌టౌన్‌ క్రైం పోలీసులు, క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement