తాండవలో రొయ్యల వేటకు అవరోధం
ఏప్రిల్ నుంచి జూన్ వరకే ప్రధానంగా స్కాంబియా రొయ్యలు వేట
వాతావరణం అనుకూలించక మత్స్యకారుల దిగాలు
గొలుగొండ : తాండవ జలాశయంలో రొయ్యల వేట ప్రారంభం అయితే మత్స్యకారులకు పండగే పండగ. ప్రతి ఏటా నాలుగు వందల కుటుంబాలకు ఈ రొయ్యల వేటే జీవనోపాధి. ఏప్రిల్ వచ్చిందంటే మూడు నెలల పాటు నిరాటంకంగా రొయ్యల వేట సాగించి మత్స్యకారులు నాలుగు డబ్బులు వెనకేసుకోవడం జగుగుతుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా వాతావరణం కనిపించడంతో మత్స్యకారులకు వేట సాగక పూట గడవడం కష్టంగా మారింది. తీవ్రమైన గాలులు, ఎండదెబ్బ వల్ల తాండవలో రొయ్యల వేట సాగడం లేదు.
400 మందికిపైగా ఉపాధి
తాండవ జలాశయం 400 మందికిపై ప్రతి రోజు ఉపాధినిస్తోంది. గత ఏడాది భారీ వర్షాల కారణంగా చేపల వేట అంతగా జరగలేదు. తాండవ జలాశయం ప్రమాద స్థాయికి చేరిపోవడంతో వేటకు వెళ్లడానికి జాలర్లు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ 15 వరకు మాత్రమే రొయ్యల వేట సాగుతుంది. కానీ ఈ సమయంలో పెనుగాలుల కారణంగా జాలర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
గాలులు, ఎండదెబ్బ
తాండవ జలాశయంలో రొయ్యల వేట ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయంలో జరుగుతుంది. తాండవ జలాశయం నిండుకుండలా ఉండడంతో వేటకు గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఉదయం 5 నుంచి 8 గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం చీకటిపడే వరకు బోట్లపై వేట సాగిస్తుంటారు. ఈ సమయంలో నిండుకుండలా తాండవ జలాశయం ఉండడంతో గాలులు ప్రభావం వల్ల వలలు చిక్కుపడడం, బిందులు కనిపించకుండా పోవడంతో వేటకు వెళ్లలేకపోతున్నారు. ఉదయం 10 గంటల తరువాత వేట సాగించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే విపరీతమైన ఎండల కారణంగా వేట సక్రమంగా సాగడం లేదు.
ఉపాధి లేక..
తాండవ జలాశయం పరిదిలో ఉన్న వెంకటాపురం, గొలుగొండ, జోగుంపేట, సాలికమల్లవరం, పొగచెట్లపాలెం, విప్పలపాలెం, గాదంపాలెం, అమ్మపేటతో పాటు నాతవరం మండలం జాలారుపేట తదితర గ్రామాల్లో జాలర్లు ప్రతి రోజు వేట సాగిస్తుంటారు. జలాశయం అతి రుచికరమైన స్కాంబియా రొయ్యలకు పుట్టినిళ్లు. కిలో 200 రుపాయలకు ఇక్కడే వ్యాపారులకు అమ్మకాలు చేస్తారు. ప్రతిరోజు ఒక్కో మత్స్యకారుడు 8 నుంచి 10 కేజీల రొయ్యల వేట సాగించగలరు. కానీ ఎండలు, గాలులు ప్రభావం వల్ల బోటు వేసుకొని వేటకు వెళితే కనీసం 2 కిలోలు రొయ్యలు కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు, ఈ సీజన్‌లో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని మత్స్యకారులు అంటున్నారు. గాలులు, ఎండలు ప్రభావం తగ్గితే తప్ప వేట సాగించలేమని అంటున్నారు.
నష్టమే తప్ప లాభం లేదు..
రొయ్యల వేటకు వెళితే వేట సాగలేదు. దీని వల్ల రోజూ కష్టం తప్ప లాభం కనిపించలేదు. గత 15 రోజులుగా ఇదే సమస్య. వేటకు వేళ్లిన సమయంలో గాలులు ప్రభావంతో వలలు నాశనం కావడం జరుగుతుంది. దీని వల్ల నష్టం వాటిళ్లుతుంది. కనీసం రోజు రూ.300 కాడా రావడం లేదు,
–రాజు, జాలరు, వెంకటాపురం
వేట సాగడం లేదు..
ఈ సీజన్ రొయ్యల వేట సరిగ్గా జరగడం లేదు. తెల్లవారి రొయ్యల వేటకు వెళుతుంటే గాలులు విపరీతంగా రావడంతో వలలు నాశనం అవుతున్నాయి. ఈ గాలికి వేటకు వెళ్లిన బోట్లు సైతం గాలులు కారణంగా తిరగబడతాయని భయం కలుగుతుంది. సాయంత్రం కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. మధ్యాహ్నం సమయంలో వెళుతుంటే ఎండల ప్రభావం కారణంగా వేట సాగించడానికి నరకయాతన పడుతున్నాం.
–జొన్నా లోవ, జాలరు, సాలికమల్లవరం


