స్వామికి అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి రెండో విడత చందనం సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం మూడు మణుగుల పచ్చి చందనాన్ని(దాదాపు 125 కిలోలు) శాస్త్రోక్తంగా సమర్పించారు. తదుపరి విశేష ఆరాధన, బాలభోగం, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థాన మండపంలో వేంచేపచేశారు. ఇందులో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచకలశ ఆవాహనం, అభిషేకం, రాజభోగం కార్యక్రమాలు నిర్వహించారు. గోవిందరాజస్వామి శిరస్సుపై చందనంతో భక్తులను కనువిందు చేశారు. కార్యక్రమంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు పాల్గొన్నారు.


