స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం

Mar 26 2026 7:39 AM | Updated on Mar 26 2026 7:39 AM

వైభవంగా ఏయూ 91, 92వ కాన్వొకేషన్లు విద్య అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

మద్దిలపాలెం: కళ్లలో భవిష్యత్తుపై కోటి ఆశలు.. చేతుల్లో ఎంతో శ్రమించి సాధించిన విద్యా పట్టాలు.. వెరసి ఆ విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. నిరంతర శ్రమకు దక్కిన పతకాలు, పీహెచ్‌డీ డిగ్రీలను సగర్వంగా చేతబూని.. తమ విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ వారు మురిసిపోయారు. శతాబ్ది ఉత్సవాలతో వందేళ్ల వైభవాన్ని చాటుకుంటున్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం ఎటు చూసినా ఈ పండగ వాతావరణమే కనిపించింది. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా.. విద్యార్థుల ఉత్సాహం, కోలాహలం నడుమ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌, ఏయూ చాన్సలర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆయన కొనియాడారు. శతాబ్దకాలంగా ఏయూ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు. సర్‌ సి.ఆర్‌.రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సి.వి.రామన్‌, సి.ఆర్‌.రావు వంటి మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డిగ్రీ సాధన అనేది విద్యా జీవితానికి ముగింపు కాదని, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభమని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్‌లో రాజకీయాలకు దూరంగా ఉండి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

సగ్గుర్తి, పతంజలి శాస్త్రిలకు డాక్టరేట్లు ప్రదానం

వేడుకల్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి గవర్నర్‌ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. జియో, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్‌ సి.ఎన్‌.వి.సత్యనారాయణ రెడ్డిలకు బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల నుంచి మొత్తం 17 మంది రీసెర్చ్‌ మెడల్స్‌ అందుకోగా.. 13 మంది రీసెర్చ్‌ ప్రైజ్‌లు, ఏడుగురు ఎం.ఫిల్‌ డిగ్రీలు, 441 మంది పీహెచ్‌డీ పట్టాలు తీసుకున్నారు. అలాగే 174 మందికి యూజీ పీజీ మెడల్స్‌, 437 మందికి యూజీ పీజీ ప్రైజులు ప్రదానం చేశారు.

విశాఖతో.. ఏయూతో ఆత్మీయ అనుబంధం

గౌరవ డాక్టరేట్‌ స్వీకరించిన అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి ప్రసంగించారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఏయూ నుంచే పట్టభద్రులయ్యారని గుర్తుచేసుకున్నారు. తన మావయ్య ప్రొఫెసర్‌ కోనేరు రామకృష్ణారావు 1984–87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వేగంగా ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్‌ ఆర్థిక పరిస్థితుల్లో భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్‌ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు.

ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో ముందంజ

ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఏయూ ఉపకులపతి జి.పి.రాజశేఖర్‌ ఆకాంక్షించారు. రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఏయూ.. విజ్ఞానం, ఆవిష్కరణలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం, చాన్సలర్‌, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ పూర్వ వీసీలు, ఇతర యూనివర్సిటీల వీసీలు, ఏయూ రెక్టార్‌, రిజిస్ట్రార్‌, ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement