విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు | - | Sakshi
Sakshi News home page

విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు

Mar 26 2026 7:39 AM | Updated on Mar 26 2026 7:39 AM

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

నేడు గురునాథరావు విగ్రహాన్ని సందర్శించనున్న సమన్వయకర్తలు, సీనియర్‌ నాయకులు

అనకాపల్లి: మండలంలోని తగరంపూడిలో ఈనెల 20వ తేదీ రాత్రి మాజీ మంత్రి, దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేయకుండా కేసును నీరుగాచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెద్దిశెట్టి గోవింద్‌ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథరావు పార్టీలకు అతీతంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారని, ఆయన మరణానంతరం తగరంపూడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించిన గ్రామ జనసేన ప్రధాన నాయకుడు భరత్‌బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 26 జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్‌ నాయకులు, గురునాథరావు అభిమానులు విగ్రహాన్ని సందర్శించనున్నట్టు చెప్పారు. తగరంపూడి సర్పంచ్‌ యాదగిరి అప్పారావు ఈనెల 21న విగ్రహం వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించి 15 రోజుల క్రితం గ్రామ జనసేన నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్‌ చేసినట్టు చెప్పారని తెలిపారని, అదే సర్పంచ్‌ ఈనెల 24న విగ్రహాన్ని జనసేన నాయకులు తొలగించమని చెప్పలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్‌ మాటమార్చే విధంగా కూటమి నేతలు ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2004లో ఏఎంఎఎల్‌ కళాశాలలో దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై పార్టీలకు అతీతంగా అప్పటి వర్తకసంఘం నాయకులు కేసులు నమోదు చేయించారని చెప్పారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కూడా పార్టీలకు ఆతీతంగా కేసు నమోదు చేయించి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించాలన్నారు. దోషులను అరెస్టు చేసేవరకూ పోరాటాలు చేస్తామన్నారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తులను అరెస్టు చేయకపోతే వచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అరెస్టు చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన కూటమి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్‌ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, తూతూ మంత్రంగా చిన్ననాయకులను అరెస్టు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు మళ్ల బుల్లిబాబు, 81వ వార్డు ఇన్‌చార్జి బొడ్డేడశివ, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్యనాయుడు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, పార్టీ నాయకులు బుద్దిరెడ్డి దేముడుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement