● అనకాపల్లిలో సర్వే నెం. 1539/5లో రూ.40 కోట్ల విలువైన భూమి
● ప్రైవేట్ వ్యక్తులకు అడ్డదారిలో కట్టబెట్టిన అధికారులు
● 1.11ఎకరాల భూమి తమది అంటున్న దేవదాయ శాఖ అధికారులు
● భూమిని పరిరక్షించాలంటూ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
● కూటమి నేతలకు కొమ్ముకాస్తున్న అధికారుల తీరుపై
వైఎస్సార్‌సీపీ ఉద్యమం
● మొక్కుబడిగా ఆ భూముల్లో
దేవదాయ శాఖ బోర్డు ఏర్పాటు
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో ఆలయాల భూములకు పరిరక్షణ కొరవడింది. కౌలుకు తీసుకున్న దేవుని భూములు కౌలు, అద్దెకు తీసుకున్న స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించి నిర్ణీత గడువు తీరిన తరువాత సంబంధిత వ్యక్తులు ఆయా ఆస్తులను వదిలేయాలి. లేకపోతే సెక్షన్ 83 ప్రకారం వారికి నోటీసులు జారీ చేసి భూములను, స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. కానీ అధికారులు మొక్కుబడిగా ఒక బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు. వాస్తవానికి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చిన తరువాత కూడా ఖాళీ చేయకపోతే పోలీసు సహకారంతో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని ఆక్రమణదారులు కోర్టులను ఆశ్రయించి దేవదాయ భూములను వివాదాల్లోకి లాగి, సొంతం చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనికితోడు కంచె చేను మేస్తున్న చందంగా భూములను కాపాడాల్సిన రెవెన్యూ, ఉన్నత అధికారులు సొంత నిర్ణయాలతో దేవదాయశాఖ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయ భూమి ఆక్రమణే దీనికి తాజా నిదర్శనం.
మొక్కుబడిగా బోర్డుల ఏర్పాటు
కన్యకాపరమేశ్వరి ఆలయానికి చెందిన దేవదాయశాఖకు చెందిన భూమిని కాస్తా ఇనాం భూమిగా పేర్కొంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై వైఎస్సార్‌సీపీ గట్టి పోరాటం చేసింది. దీంతో సోమవారం దేవదాయ శాఖ అధికారులు యథావిధిగా దేవదాయశాఖకు చెందిన భూమి అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే కాండ్రేగుల సూరి అప్పారావు కుటుంబ సభ్యులు బోర్డులు పెట్టవద్దంటూ అడ్డుకున్నారు. ఈ తరుణంలో దేవదాయశాఖ జిల్లా అధికారి సుధారాణి, పట్టణ పోలీసులు వచ్చారు. కాండ్రేగుల సూరి అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ కన్యకాపరమేశ్వరి ఆలయ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు.
చక్రం తిప్పిన వ్యక్తులపై చర్యలేవీ...
కన్యకాపరమేశ్వరి ఆలయ భూముల విషయంలో దేవదాయశాఖ కమిషనర్ చేతిలోని అధికారాలను కాదని జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేయడం వెనుక చక్రం తిప్పిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రికార్డుల్లో దేవదాయశాఖ భూమి అని తెలుపుతూ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ఆదేశాలు జారీచేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై కిందిస్థాయి నుంచి కలెక్టరేట్ వరకూ రికార్డులను ఎవరు సృష్టించారనే విషయం కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన నేతలపై, సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు, వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ రికార్డులతో కబ్జాలు...
అనకాపల్లి జిల్లాలో చిన్నవి, పెద్దవి కలిపి 700కు పైగా ఆలయాలు ఉన్నాయి. దేవదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆలయాలకు 5,468 ఎకరాల భూములు ఉన్నట్టు సమాచారం. వీటిలో ఎక్కువ శాతం అనకాపల్లి, యలమంచిలి, దేవరాపల్లి, వి.మాడుగుల మండలాల్లో ఉన్నాయి. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం దశాబ్దాల కిందట దాతలు ఇచ్చిన భూములపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో కొందరు వ్యక్తులు మాన్యం భూములను దీర్ఘకాలంగా తమ ఆధీనంలో ఉంచుకోగా, మరికొందరు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులంటూ నకిలీ ధ్రువపత్రాలతో కోర్టులను ఆశ్రయించి సొంతం చేసుకుంటున్నారు. దేవదాయ శాఖ అధికారులు సైతం న్యాయస్థానాల్లో వాదనలు బలంగా వినిపించకపోవడం, తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆలయాల భూములు అన్యులపాలవుతున్నాయి.


