అనకాపల్లి : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, జిల్లాలో అక్రమ ఆయుధాలు వినియోగంపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. సోమవారం తమ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నా, రవాణా చేసినా, తయారు చేసినా అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయుధాల చట్టం ప్రకారం, ప్రభుత్వ నిబంధనలకు లోబడి తగిన విచారణ తర్వాత మాత్రమే తుపాకులకు లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందని, లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉండడం నేరమన్నారు. కొంతమంది వేటగాళ్లు జీవనోపాధి పేరుతో నాటు తుపాకులను వాడుతున్నారని, అనుమతి లేని ఏ ఆయుధమైనా చట్టరిత్యా నేరమేనని అన్నారు. ‘జీవనోపాధి‘ అనే సాకుతో అక్రమ ఆయుధాలను కలిగి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ పొందిన ఆయుధాల పట్ల కూడా యజమానులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లైసెన్స్ ఉన్న ఆయుధాలను ఇతరులకు ఇవ్వడం, గాలిలో కాల్పులు జరపడం, భద్రతలో నిర్లక్ష్యం వహించడం వంటివి చేస్తే సదరు వ్యక్తుల లైసెన్స్‌ను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ ఆయుధాల గురించి సమాచారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని, తెలియజేసిన వ్యక్తుల పేర్లు గోప్యాంగా ఉంచడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.


