సింహాచలం: వచ్చే నెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శేఖర్, టెక్నికల్ అడ్వైజర్ సుబ్బారావులు సోమవారం పరిశీలించారు. గత ఏడాది చందనోత్సవం రోజు నాసిరకంగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఈ ఏడాది అలాంటి పొరపాట్లకు తావులేకుండా జరుగుతున్న పనుల్ని పరిశీలించాల్సిందిగా దేవదాయశాఖ కమిషనర్ ఆ శాఖ చీఫ్ ఇంజనీర్‌ని, టెక్నికల్ అడ్వైజర్‌ని ఆదేశించారు. ఈ మేరకు సింహగిరికి వచ్చిన వీరిరువురూ ఆయా పనుల ప్రణాళికను పరిశీలించారు. సింహగిరి మెట్లమార్గం విస్తరణ ఆరా తీశారు. మెట్ల మార్గం విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఆ పనులు పూర్తిచేయాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సూచించారు. ఇటీవల సింహగిరికి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కోసం స్థల పరిశీలన జరిపారు. భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్లు, తాగునీరు, క్యూల్లో ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. వారి వెంట దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రాంబాబు, రామకృష్ణ, రమణ, డీఈ హరి, ఏఈలు రవిరాజు, తిరుపతిరావు తదితరులు ఉన్నారు.


