మృతుని కుటుంబానికి హోంగార్డుల విరాళం
హోంగార్డు వెంకటరమణ భార్య భవానికి చెక్కు అందిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో పంచాది వెంకటరమణ ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి హోంగార్డులు తమ ఒక రోజు గౌరవ వేతనం విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ మొత్తం రూ.4,06,535 చెక్కును వెంకటరమణ భార్య భవానికి శుక్రవారం తన కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ హోంగార్డులు మృతి చెందినా, పదవీ విరమణ చేసినా ఒక రోజు వేతనాన్ని తోటి హోంగార్డులు స్వచ్ఛందంగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయ ఏవో సిహెచ్.తిలక్‌బాబు, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.


