ప్రణతోస్మి దివాకరం | - | Sakshi
Sakshi News home page

ప్రణతోస్మి దివాకరం

Jan 26 2026 4:40 AM | Updated on Jan 26 2026 4:40 AM

ప్రణత

ప్రణతోస్మి దివాకరం

ఘనంగా రథసప్తమి వేడుకలు ● రాజుపాలెంలో ఆదిత్యుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

అనకాపల్లి: ప్రత్యక్ష దైవానికి జగతి భక్తితో ప్రణమిల్లింది. తమను కాపాడమని కర్మసాక్షిని మనసారా ప్రార్థించింది. సకల జీవరాశులకు ప్రాణశక్తిని ఇచ్చి చల్లగా చూసే లోకబాంధవుడికి, ఆ దివ్యతేజోమూర్తికి రథసప్తమి రోజున భక్తకోటి అంజలి ఘటించింది. జిల్లాలో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రభాకరుడి ఆలయాలు ఆదిత్య హృదయ పఠనంతో మార్మోగాయి. జీవీఎంసీ విలీన గ్రామమైన రాజుపాలెంలో సూర్యనారాయణస్వామిని వేలాదిమంది భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వెలుగుల రేడును కనులారా తిలకించి పులకించి పోయారు. రథసప్తమి కావడంతో విశాఖ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలుచుకున్నారు. జీవీఎంసీ విలీన గ్రామైన కె.ఎన్‌.ఆర్‌.పేట నుంచి రాజుపాలెం వరకూ వెళ్లే ప్రధాన రహదారి, తాడి నుంచి ఎరుకువానిపాలెం మీదుగా రాజుపాలెం వచ్చే రహదారితో పాటు మునగపాక మండలం నుంచి రామారాయుడుపేట వచ్చే రహదారి మీదుగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవాదళ్‌ సభ్యులు భక్తులకు ఎక్కడికక్కడ సహకరించారు. ఇరుకై న రహదారి కావడంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో రూరల్‌, పట్టణ, ట్రాఫిక్‌ సీఐలు అశోక్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, ఎం.నారాయణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 200 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వశాఖ అధికారులను దుశ్శాలువాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఘనంగా ఊరేగింపు

స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రాజుపాలెం పరిసరప్రాంతాల్లో రథంపై కమిటీ సభ్యులు ఘనంగా ఊరేగించారు. వ్యాపారవేత్త బంగారు సూరిబాబు, ఆదిబాబు దంపతుల ఆధ్వర్యంలో సుమారు 20వేల మంది భక్తులకు అన్నసమారాధన చేశారు. రాత్రి స్టేజ్‌ ప్రోగ్రాంలు, నేలవేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత మందుగుండు సీతారామయ్య కుమారులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చడంతో ఆలయపరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి.

భక్తిశ్రద్ధలతో సూర్యనమస్కారాలు

మాడుగుల: మండలంలోని సత్యవరంలో సమరసత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేలుకొలుపు భక్తులు శారదా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు, సూర్యనమస్కారాలు చేశారు. నది ఒడ్డున కొత్తకుండల్లో పాయసం తయారు చేసి, ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించారు. తవ్వా సన్యాసిశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పూజలందుకున్న సూర్యనారాయణమూర్తి

ప్రణతోస్మి దివాకరం1
1/1

ప్రణతోస్మి దివాకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement