ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం
● మహిళ నుంచి దఫదఫాలుగా
రూ.12.30 లక్షల వసూలు
● గతంలో ఓ వ్యక్తి అరెస్టు, తాజాగా
మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళ నుంచి దఫదఫాలుగా రూ.12లక్షల 30వేలు వసూలు చేసిన కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఈనెల 16న ఎరగోర్ల శ్రీను అనే వ్యక్తిని అరెస్టు చేయగా, గురువారం షేక్ సలీం అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఆయన తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో తమకు పరిచయం ఉందని, టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వీరు నిరుద్యోగ మహిళను మోసం చేసినట్టు చెప్పారు. జిల్లాలో రోలుగుంట పోలీసు స్టేషన్ పరిధిలో అదే గ్రామానికి చెందిన నిరుద్యోగ మహిళ డీఎస్సీకి సిద్ధమవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎరగోర్ల శ్రీను అనే వ్యక్తి ఆమె భర్తకు పరిచయమయ్యాడు. తమకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్దవారితో సంబంధాలున్నాయని రూ.15లక్షల ఇస్తే డీఎస్సీ–2025లో ఎస్టీజీ పోస్టు ఇప్పిస్తామని నమ్మబలికినట్లు ఎస్పీ తెలిపారు. మహిళకు అనుమానం వచ్చినప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా రూపొందించిన ఒక నకిలీ ఆడియో క్లిప్పింగ్‌ను చూపించినట్టు తెలిపారు.మరో సారి బాధితురాలికి అనుమానం వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్ పీఏ భార్గవ్ చౌదరి మాట్లాడుతున్నట్లు షేక్ సలీంఅనే వ్యక్తితో ఫేక్ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడించినట్టు చెప్పారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో బాధితురాలు రోలుగుంట పోలీసుస్టేషన్‌లో గత నెల ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ఈనెల 16న ప్రకాశం జిల్లాకు చెందిన ఎరగోర్ల శ్రీనును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. శ్రీను గతంలో విజయవాడలో విద్యుత్‌శాఖలో లైన్‌మెన్ పోస్టు ఇప్పిస్తానని రూ.2.50లక్షలు, అద్దంకిలో ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.11 లక్షలు నిరుద్యోగుల నుంచి వసూలు చేశాడని, అక్కడ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. ఫేక్ కాల్ చేసిన విజయవాడకు చెందిన షేక్ సలీంను ఈనెల 22న విజయవాడలో అరెస్టు చేసినట్టు చెప్పారు. ఫేక్ ఫోన్‌కాల్ మాట్లాడేందుకు శ్రీను నుంచి షేక్ సలీం రూ.50వేలు తీసుకున్నట్టు చెప్పారు. ఫోన్ కాల్‌డేటా ద్వారా షేక్ సలీంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన, అధికారిక ప్రక్రియ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్‌ఐ పి.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


