ఏం బ్యాగులేదు!
●సర్కారు వారి బ్యాగులు.. చిరుగులు
●మూణ్ణాళ్ల ముచ్చటగా విద్యార్థి మిత్ర కిట్లు
అచ్యుతాపురం మండలంలో జెడ్పీ హైస్కూల్లో చిరిగిన బ్యాగ్‌లతో విద్యార్థులు
మాడుగుల మండలం వీరన్నారాయణం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులు చిరిగిన బ్యాగ్‌లతోనే పుస్తకాలు తీసుకెళుతున్న దృశ్యం
సాక్షి, అనకాపల్లి:
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఈ కిట్లలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉండటంతో కొద్ది రోజులకే చిరిగిపోయాయి. జిప్పులు పనిచేయడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు సర్కార్ నిర్ల క్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, స్కూలు బ్యాగులతోపాటు కిట్‌లో ఇచ్చే అన్ని వస్తువుల నాణ్యత ఎలా ఉందో స్వయంగా పరిశీలించేవారు. కానీ అంత శ్రద్ధ లేకపోవడంతో నాసి రకమైన బ్యాగులు ఇచ్చి కాంట్రాక్టర్లు, అధికారులు చేతులు దులుపుకున్నారు. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని, వాటిని మోయాల్సివస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కిట్‌లో భాగంగా ఇచ్చిన బూట్లు అందరికీ సరిపడకపోవడంతో వాటిని ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లనే బడికి వేసుకు వెళుతున్నారు.
ఎంఈవో కార్యాలయం నుంచి డీఈవోకు..
జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన బ్యాగుల్లో నెల వ్యవధిలోనే 10 శాతం బ్యాగ్‌లు పాడయ్యాయని ఎంఈవో కార్యాలయం నుంచి డీఈవోకు రిటర్న్ పంపించారు. అలాంటివి పాయకరావుపేట మండలంలో 300, నక్కపల్లి మండలంలో 101, ఎస్.రాయవరంలో 58, అనకాపల్లి 120, మాడుగుల 122, కె.కోటపాడు 62, దేవరాపల్లి 62, చోడవరం 120, బుచ్చెయ్యపేట 80, రావికమతం 100, రోలుగుంట 90, యలమంచిలి 120, రాంబిల్లి 50, అచ్యుతాపురం 110, నర్సీపట్నం 120, గొలుగొండ 50, నాతవరం 40, సబ్బవరం 110, పరవాడ 66, మాకవరపాలెం 80, కశింకోట మండలంలో 125 బ్యాగులు ఉన్నాయని యాప్‌లో నమోదు చేసి వెనక్కు పంపించారు.
నాణ్యత లేని బ్యాగ్‌లతో విద్యార్థులకు ఇక్కట్లు
మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్‌లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంతమంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు. – పైల రమేష్, వెంకటాపురం, కోటవురట్ల మండలం
ఏం బ్యాగులేదు!
ఏం బ్యాగులేదు!
ఏం బ్యాగులేదు!


